ArticlesNews

సంత్ సమ్మేళనాలు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పునఃప్రారంభం

188views

ప్రతి 12 సంవత్సరాలలో ప్రకృతిలో వచ్చే మార్పులు, కాలానుగుణంగా చేయవలసిన పనులు సమాజంలోని ప్రజల అవసరాలు, నియమాల విషయంలో అనుభవం కలిగిన సాధువులు సన్యాసులు కలిసి సమ్మేళనాలు నిర్వహించి తీర్మానాలు చేసి దేశ ప్రజలందరికీ తద్వారా ప్రపంచ ప్రజలందరికీ మార్గదర్శనం చేస్తుంటారు. ఇలా లక్షల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నట్లుగా చరిత్ర. కానీ, దురదృష్టవశాత్తు రాజా శ్రీహర్షుని పాలనా కాలం 644వ సంవత్సరంలో జరిగిన సంత్ సమ్మేళనం తర్వాత విదేశీ దండయాత్రల కారణంగా సాధారణ పుణ్యస్నానాలు చేయడం జరిగినప్పటికీ, కుంభమేళా సందర్భంగా స్వామీజీల సమావేశాలు, తీర్మానాలు ప్రబోధాలు ఆగిపోయాయి. మళ్లీ 1966వ సంవత్సరం నుంచి పునః ప్రారంభం అయినాయి.

1964 సంవత్సరంలో ప్రారంభమైన విశ్వహిందూ పరిషత్ 1966వ సంవత్సరంలో జరిగిన కుంభమేళాలో ప్రపంచవ్యాప్తమైన హిందువులతో ‘విశ్వసమ్మేళనం’ నిర్వహించింది. ఆ సమయంలో హిందూ ధర్మంలోని వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక మార్గాలకు చెందిన ధర్మగురువులైన నలుగురు శంకరాచార్యులు, వైష్ణవాచార్యులు, నింబార్కాచార్యులు, బౌద్ధ, జైన, సిక్కు, గాణాపత్య, శాక్తేయ అనేకానేక వైవిధ్యం కలిగిన ఆరాధనా పద్ధతులు అనుసరించే వర్గాలకు నేతృత్వం వహించే పెద్దలందరూ పాల్గొన్నారు. ఈ ప్రయత్నం వందల సంవత్సరాల తర్వాత పూజ్యులు మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ నాయకత్వంలో విశ్వహిందూ పరిషత్ చేసిన ప్రయత్నం కారణంగా సాధ్యపడింది.

2025లో జరిగే కుంభమేళాలో కూడా జనవరి 24, 25వ తేదీలలో మార్గదర్శక మండలి సమ్మేళనం, 26 తేదీన దేశం నలుమూలల నుంచి 128 వివిధ ఆరాధన మార్గాలకు చెందిన ‘సంత్ సమ్మేళనం’, 27వ తేదీన ‘యువ సంత్’ సమ్మేళనం జరగబోతున్నది.స్వాతంత్ర పోరాటానికి ఊపిరిలూదిన కుంభమేళా దేశవ్యాప్తంగా కుంభమేళాలలో కలిసే ప్రజలు ధార్మిక, ఆధ్యాత్మిక సంకల్పాలతో పాటు స్వాతంత్య్రం సాధిస్తామని ప్రతిజ్ఞను కూడా చేసి తిరిగి వెళ్లేవారు.

అంతేకాదు తల్లిని బానిసత్వం నుంచి విడిపించిన గరుత్మంతుడిని గుర్తుచేసుకొని భారతమాతను బందీ నుంచి విడిపిస్తామని సంకల్పాన్ని తీసుకుని వెళుతుండేవారు. దేశవ్యాప్తంగా తిరుగుబాటు, ఆందోళనలు జరగడానికి, స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించే నాయకులను గుర్తించి వారి నాయకత్వాన్ని స్వీకరించడానికి వారి మార్గదర్శనాన్ని పొందడానికి దేశ ప్రజలకు ఈ కుంభమేళాలు వేదికలుగాఉపయోగపడేవి.