
మహాకుంభమేళా జరిగే ప్రాంతం వైపు ముస్లింలు వెళ్లొద్దని ఇటీవల ఆదేశాలిచ్చిన బరేల్వీ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణి సంగమంలో పుష్కరానికి ఒకసారి జరిగే మహా కుంభమేళా వేడుకలో ముస్లింల మతమార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆలిండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రజ్వీ బరేల్వీ అసత్య ఆరోపణలు చేశారు.
‘‘ హిందూ కార్యక్రమంలో ముస్లింల మతమార్పిడి తంతు జరగబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని అసత్య ప్రేలాపనలు చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి తెస్తూ ఒక లేఖ రాశానని, ఇక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కార్‌దే’’ అని బరేల్వీ అన్నారు. తమ వక్ఫ్ భూమిలో మహాకుంభమేళా జరగబోతోందని అఖిల భారత ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ తెలిపారు. వక్ఫ్ భూమిలో ఇంతటి ఉత్సవం నిర్వహించేందుకు అనుమతించి ముస్లింలు తమ విశాల హృదయాన్ని చాటుకున్నారని.. హిందువులు కూడా ఇచ్చిపుచ్చుకునే రీతిలో ఈ కార్యక్రమానికి తమను అనుమతించాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై హిందూ మహాసభ మండిపడింది. పాకిస్థాన్ ప్రేరిత మౌలానాను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. మహాకుంభ్‌ను ఆటంకపరచడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంది.
సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు నడిపే దుకాణాల నుంచి పూజాసామగ్రిని కొనుగోలుచేయాలని రాబోయే భక్తులకు గతంలో అఖిలభారతీయ అఖాడ పరిషత్ పిలుపునిచ్చి తరుణంలో భిన్నమైన ఆరోపణలు వెల్లువెత్తడం గమనార్హం.
కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనుంది. కుంభమేళా జరిగే ప్రాంతాల్లో స్థానిక ముస్లింలు వ్యాపారాలు చేసుకోకుండా అడ్డుకోవాలని ఉద్దేశంతో కొన్ని కుట్రలు పన్నుతున్నాయని ముస్లిం, ఇతర మతాల నేతలు హిందూ సంస్థలుపై విషం కక్కుతున్నారు.





