
ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహా కుంభమేళా 2025 సందర్భంగా భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల సౌకర్యార్ధం భారతీయ రైల్వే 13 వేల రైళ్లను నడపనుంది. వీటిలో 10 వేలు రెగ్యులర్ రైళ్లు, 3 వేలు ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లు 50 రోజుల పాటు నడవనున్నాయి. ఇందులో కుంభమేళా ముందు, తరువాత 2 నుండి 3 రోజులు అదనంగా ఉంటాయి. ఈ మేరకు ఉత్తర మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శశికాంత్ త్రిపాఠి మాట్లాడుతూ… యాత్రికులకు సున్నితమైన, సురక్షితమైన అనుభవాన్ని అందించడానికి రైల్వే ఒక ప్రణాళికను రూపొందించిందని చెప్పారు. లక్షలాది మంది భక్తులు, సందర్శకులకు నిరంతరాయంగా సమాచార, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం, రైల్వే అధికారులు కలిసి పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఈనెల 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రయాగ్ రాజ్ లోని గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద మహా కుంభమేళా జరగనుంది. వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక ఆకర్షణలతో ఈ కుంభమేళా ఘనంగా నిర్వహించానున్నారు





