
ఒడిశాలోని కియోంజర్ బద్ బిల్ పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడమే కాకుండా వెండి ఆభరణాలు, ఇతర సామాగ్రిని కూడా దొంగతనం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల్లో కొందరు తీవ్రంగా గాయపడ్డారు కూడా. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. ఫిలంహాల్ చౌక్, బాటా చౌక్, బంగ్లా చౌక్, కిరిబురు చౌక్ వంటి కీలక ప్రదేశాల్లో నిరసనలకు దిగారు.
దుండగులను గుర్తించి, వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే రోడ్లను కూడా దిగ్బంధించారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను మోహరించారు. ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేస్తున్నామన్నారు.





