
బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లలో హిందువులు, మైనారిటీ వర్గాలపై ఇటీవల దాడులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా షేక్ హసీనా ప్రభుత్వం తర్వాత వీటి సంఖ్య భారీగా చోటు చేసుకుంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక ఘటనలకు సంబంధించి ఈ ఒక్క ఏడాదిలోనే 2200 కేసులు నమోదైనట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. పాకిస్థాన్ లోనూ ఈ ఏడాది 112 కేసులు రికార్డయ్యాయని రాజ్యసభకు సమాచారం ఇచ్చింది.
‘‘హింసాత్మక ఘటనలను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. వీటిపై మన ఆందోళనను బంగ్లా ప్రభుత్వానికి వ్యక్తం చేశాం. హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పించేందుకు బంగ్లాదేశ్ అవసరమైన చర్యలన్నీ తీసుకుంటుందని ఆశిస్తున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. దౌత్యమార్గాల ద్వారా ఆయా ప్రభుత్వాలతో తమ ఆందోళన తెలియజేశామని.. ఇటీవల బంగ్లాలో పర్యటించిన విదేశాంగ కార్యదర్శి కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటించారని పేర్కొంది.
అటు మతపరమైన హింస, మైనారిటీ వర్గాలపై దాడులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కు కూడా విజ్ఞప్తి చేసినట్లు భారత విదేశాంగ వెల్లడించింది. అక్కడి మైనారిటీలపై జరుగుతున్న దారుణాల గురించి అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ తీరును ఎండగడుతూనే ఉన్నామని తెలిపింది.
విదేశాంగ నివేదిక ప్రకారం.. హిందువులపై హింసాత్మక ఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్‌లో 2022లో 47, 2023లో 302కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ 8నాటికి ఏకంగా 2200 కేసులు రికార్డయ్యాయి. పాకిస్థాన్‌లో 2022లో 241 కేసులు, 2023లో 103, 2024లో 112 ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ రెండు దేశాలు మినహా మరే పొరుగు దేశంలో హిందువులపై హింసాత్మక దాడులు నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
మరోవైపు భారత్‌లోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలంటూ బంగ్లాదేశ్‌లో కొందరు చేస్తున్న వాదనను భారత్ తీవ్రంగా ఖండించింది. బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. పొరుగుదేశ ప్రజలు, అక్కడి తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలను పెంపొందించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. బంగ్లా వైపు నుంచి ఈ తరహా చర్యలు నిరాశ కలిగిస్తున్నాయని విదేశాంగశాఖ పేర్కొంది.





