ArticlesNews

దేవం తం సూర్యం ప్రణమామ్యహం

346views

( డిసెంబర్ 22 – రథసప్తమి )

సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

కశ్యపుడి పుత్రుడు, తెల్లని పద్మాన్ని ధరించినవాడు, ప్రచండుడు, సప్త అశ్వాల రథాన్ని అధిరోహించిన వాడు అయిన సూర్యుణ్ణి.. ప్రత్యక్ష దైవాన్ని ఆరాధిస్తున్నాను- అనేది భావం. ఆదివారం సప్తమి తిథి వస్తే దానిని భానుసప్తమి అంటారు. మిత్ర సప్తమి, నందాసప్తమి అని కూడా వ్యవహరిస్తారు. ఈ పర్వదినాన సూర్యునికి ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని నివేదిస్తారు. ఈ రోజున చేసే దానం, జపం, హోమం లక్ష రెట్ల ఫలితాన్ని ఇస్తుందన్నది శాస్త్ర వచనం. రోజూ సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానాదులు చేయని, ఆహార నియమాలు పాటించని వారిని అనారోగ్యం, దారిద్య్రం పీడిస్తాయని సూర్యాష్టకం పేర్కొంది. ప్రత్యేకించి ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి, అభ్యంగన స్నానం చేయకూడదు. ఒంటికి, తలకు నూనె పెట్టుకోరాదు, ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసాదులకు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి- వంటి నియమాలున్నాయి. నవ గ్రహాలకు అధిపతి సూర్య నారాయణుడు. ఆయన అనుగ్రహం ఉంటే అసాధ్యమైంది ఏదీ లేదు. సూర్యారాధనతో మనశ్శాంతి, విద్య, వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ ప్రాప్తి, వివాహ యోగం, సంతానసిద్ధి వంటి శుభఫలితాలు కలుగుతాయి.

భానుసప్తమి రోజున సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, సూర్య ద్వాదశ నామాల పఠనం శ్రేయస్కరం. ‘శ్రీసూర్య నారాయణాయ నమః’ అని స్మరించటం వల్ల కూడా సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఇష్ట కామ్యాలు సిద్ధిస్తాయి. శ్రీరామ చంద్రుడు సూర్యదేవుని ప్రార్థించి రావణాసురుని జయించాడు.