News

పాకిస్తాన్ కు అమెరికా షాక్ …

236views

పాకిస్తాన్ కు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. పాక్ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు మరో నాలుగు కీలక సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి సాంకేతికత వ్యాప్తికి పాక్ కు చెందిన సంస్థలు సహకరిస్తున్నాయని, సామూహిక జన హనన ఆయుధాల తయారీకి సాయపడుతున్నాయని అమెరికా ఆరోపించింది. పాక్ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌ సహా నాలుగు కంపెనీలపై ఆంక్షలు విధించింది.

కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న అక్తర్‌ సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అఫిలియేట్స్‌ ఇంటర్నేషనల్‌, రాక్‌సైడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. క్షిపణి ప్రయోగానికి వినియోగించే పరికరాలను ఎన్ డీసీ కొనుగోలు చేస్తోందని, షాహిన్‌ శ్రేణి క్షిపణుల తయారీలో చురుగ్గా పాల్గొందని అమెరికా తెలిపింది. పరికరాల తయారీకి అవసరమైన ముడిపదార్థాలను ఎన్ డీసీకి అక్తర్‌ అండ్‌ సన్స్‌ సంస్థ సరఫరా చేస్తోందని వెల్లడించింది.

ఎన్ డీసీ తరఫున మిసైల్ లో వినియోగించే పరికరాలను అఫిలియేట్‌ ఇంటర్నేషనల్‌ కొనుగోలు చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూమిల్లర్‌ తెలిపారు. తమ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంపై పాకిస్తాన్ స్పందించింది. ఇలాంటి పరిణామం పూర్తిగా దురదృష్టకరమని, పక్షపాతంతో కూడుకున్నదని పేర్కొంది.