ArticlesNews

గోవా విమోచన దినోత్సవం: ఆర్.ఎస్.ఎస్. భూమిక

454views

( డిసెంబర్ 19 – గోవా విమోచన దినోత్సవం )

దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినా ఆ తరువాత 13 యేళ్లకుగానీ గోవా స్వేచ్ఛావాయువులు పీల్చలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ నేతలు పోర్చుగీస్ కాలనీలు గోవా, డయ్యూ , డామన్ దాద్రా, నగర్ హవేలి, ఫ్రెంచ్ కాలనీ పాండిచ్చేరి (ఇప్పుడు పుదుచ్చేరి) సంగతి మర్చిపోయారు కానీ, మాతృభూమి పట్ల అత్యంత భక్తి ప్రపత్తులు కలిగిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ మాత్రం మర్చిపోలేదు. గోవా విముక్తి పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు కీలక పాత్ర పోషించారు. 1961, డిసెంబర్ 19న గోవా విదేశీ పాలన నుంచి బయటపడింది. గోవాలో పోర్చుగీసు పాలన అంతం కావాలని ఆ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చెయ్యాలని 1955లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కోరింది. ఈ విషయంలో సైనిక బలగాలను ఉపయోగించడానికి నెహ్రూ నిరాకరించడంతో ఆర్‌ఎస్‌ఎస్, రాష్ట్ర సేవికా సమితికి చెందిన కార్యకర్తలు జగన్నాథరావు జోషితో పాటు ఐదు వేల మందితో 1955 జూన్ 15న సత్యాగ్రహం ప్రారంభించారు. ఇందులో మూడు వేల మంది మహిళలు కూడా పాల్గొన్నారు. 1955 ఆగస్ట్ 15న పోలీసులు జరిపిన కాల్పులతో 50 మంది పౌరులు చనిపోయారు. అనేకులు తుపాకి గుండ్ల దెబ్బలు తిన్నారు. అనేక మంది పోర్చుగీసు జైళ్లలో అమానుష చిత్రహింసలను అనుభవించారు.

1955లో పనాజీ సచివాలయం మీద మొట్టమొదటి సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వ్యక్తి గోవాలో అధ్యాపకునిగా పనిచేస్తున్న ఒక స్వయంసేవక్. 1961లో ‘గోవా విముక్తం’ అయిన తరువాత కూడా మొత్తం 17 సంవత్సరాల పాటు ఆయన లిస్భన్ జైలులో ఉన్నాడు. గోవా విముక్తికి అన్ని రాజకీయ పక్షాలు కలిసి సాగించిన జాతీయ పోరాటంలో స్వయంసేవకులు ప్రధాన పాత్ర నిర్వహించారు. దేశం నలుమూలల నుండి వెల్లువలా వస్తున్న సత్యాగ్రహులకు గోవా సరిహద్దు వెంబడి భోజన వసతి సమకూర్చే కార్యాన్ని స్వయంసేవకులు తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. సంఘ్, జనసంఘానికి చెందిన ప్రముఖ కార్యకర్తలు అనేక సత్యాగ్రహ బృందాలకు నాయకత్వం వహించారు.

సత్యాగ్రహ బృందాలకు నాయకత్వం వహించిన ప్రముఖ స్వయంసేవకులలో మధ్యభారత్ బృందానికి నాయకత్వం వహించిన ఉజ్జయినికి చెందిన రాజాభావు మహంకాళ్ ఒకరు. మాతృభూమి స్వాతంత్య్ర సాధనా కార్యంలో అజరామరమైన ఘనతను సాధించుకున్న అమరవీరుల్లో ఆయన ఒకరు. 1954 ఏప్రిల్‌లో నేషనల్ మూమెంట్ లిబరేషన్ ఆర్గనైజేషన్, ఆజాద్ గోమాంతక్ దళ్‌లతో కలిసి,దాద్రా నగర్ హావేలీలను భారత రాజ్యంలో విలీనం చెయ్యడానికి ఆర్ఎస్ఎస్ ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేసింది. 1954 ఆగస్ట్ 2న ఆజాది గోమంతక్ దల్ అనే దళం ఆధ్వర్యంలో అనేక మంది యువకులు దాద్రా, నగర్ హవేలీని చేజిక్కించుకోవడంలో ముఖ్య పాత్ర వహించారు. దాద్రా, నగర్ హవేలీలోనికి వంద మంది సంఘ స్వయంసేవకులు జొరబడ్డారు. పుణె సంఘచలాక్ స్వర్గీయ వినాయకరావు ఆప్టే నేతృత్వంలో ఈ దాడి జరిగింది. ఆ బృందంలో అనేక మంది ప్రముఖులైన సంఘ కార్యకర్తలు ఉన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన సూరి సీతారాం అనే స్వయంసేవక్ తన దళంతో కలిసి ఈ పోరాటంలో పాల్గొని అమరుడు అయ్యాడు.

ఆజాద్ గోమంతక్ దళ్‌లో సభ్యులు మోహన్ రానడే అతని స్నేహితుడు తేలు మాస్కురానాస్ గోవాలో ఆ తరువాత వివిధ పోర్చుగీస్ జైళ్లలో 1969 వరకు శిక్ష అనుభవించారు. ప్రముఖ సంగీత దర్శకుడు స్వయంసేవక్ అయిన సుధీర్ ఫడ్కే ప్రయత్నాల మూలంగా చివరికి వారు విడుదల అయ్యారు. స్వాతంత్ర్య యోధుడు మోహన్ రానడే తన `సర్ఫరోషీ కీ తమన్నా’అనే పుస్తకంలో పోర్చుగీసు కాలనీలను విముక్తం చెయ్యడానికి జరిగిన అనేక ప్రయత్నాలను నెహ్రూ ఏ విధంగా నీరుగార్చారో ఆ పుస్తకంలో వివరించారు. ఈ విముక్తి పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు పాల్గొన్నారని మోహన్ రానడే చెప్పడం జరిగింది. భారతదేశ సార్వభౌమత్వం పరిరక్షణలో స్వయంసేవకుల త్యాగాలు మరువలేనివి.