News

పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట ఏదీ?

329views

విజయనగరం జిల్లా బొబ్బిలిలో పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమార్కులు వివిధ సంతల్లో వాటిని కొనుగోలు చేసి వాహనాల్లో కబేళాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ప్రతి గురు, శుక్రవారాల్లో తెల్లవారుజామున పార్వతీపురం, ఒడిశా, సాలూరు తదితర ప్రాంతాల నుంచి జాతీయ రహదారిలో పెద్దఎత్తున పశు అక్రమ రవాణా జరుగుతుంది. అలాగే, బొబ్బిలి నుంచి విజయనగరం వరకు హైవే మీదుగా పశువులను కంటైనర్లలో అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయినా రవాణాను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. అన్ని చోట్లా సచివాలయాల సిబ్బంది రాత్రి పగలు నిఘా పెట్టి కేసులు నమోదు చేయాలని ఆర్డీవో లిఖితపూర్వక ఆదేశాలు జారీచేశారు. అ క్రమ రవాణాకు సంబంధించి వారానికి కనీసం నాలుగు కేసులైనా నమోదు చేయాలని ఆదేశాలిచ్చినప్పటికీ ఎక్కడా అలా జరగడం లేదు. ఇప్పటికైనా పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరముంది.

– బొబ్బిలి పట్టణంలో రెండేళ్ల కిందట పశువుల వ్యాన్‌ ఢీకొని ఒకరు మృతిచెందారు. ఈ ఘటనతో పశువుల అక్రమ రవాణా వెలుగుచూసింది. చిన్న వాహనంలో 14 పశువులను కుక్కి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ పశువులను గోశాలకు తరలించాలన్న నిబంధన ఉంది. కానీ, గోశాలలు అందుబాటులో లేకపోవడంతో సంరక్షణ కోసం ఆ 14 ఆవులను పశువైద్యుని సమక్షంలో నిందితులకే పోలీసులు అప్పగించారు. వాటిని కోర్టుకు అప్పగించాలన్నప్పుడు తీసుకురావాల్సి ఉంటుందని పోలీసులు పూచీకత్తు రాయించారు.

– దత్తిరాజేరు మండలం పెదమానాపురంలో ప్రతీ శుక్రవారం పశువుల సంత జరుగుతుంది. ఈ సంతలో ప్రతివారం 8 వేల వరకూ మూగజీవాల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. అయితే ఇందులో ఎక్కువ పశువులు ఇతర రాష్ట్రాల్లోని కబేళాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమ రవాణాను ఆర్డీవో నేతృత్వంలోని సంతల మానటరింగ్‌ కమిటీ అడ్డుకోవాల్సి ఉంది. కానీ, పెదమానాపురం సంత యాజమాన్యంతో సంతల మానటరింగ్‌ కమిటీ కుమ్మక్కై అక్రమంగా లైసెన్సు మంజూరు చేసినట్లు ఉన్నతాధికారులు గతంలో గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నేరుగా సీఎంవోకు నివేదిక పంపించారు. దీనిపై ఎటువంటి చర్యలు లేవు.

– బొబ్బిలి మండలం గొర్లెసీతారాంపురం సమీపంలో ఇటీవల పశువుల వ్యాన్‌ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 పశువులు మరణించగా, అనేక పశువులు తీవ్రంగా గాయపడ్డాయి. కొన్ని పశువులు ప్రమాద స్థలం నుంచి చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్లిపోయాయి. ఒడిశా నుంచి విజయవాడకు అక్రమంగా తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కానరాని నిబంధనలు..
-గోశాల ఏర్పాటుకు స్థలం కేటాయించా లన్న నిబంధన ఉంది. కానీ, జిల్లాలో స్థలం కేటాయించడం లేదు. గోశాల లేకపోవడంతో పోలీసులు పట్టుకున్న పశువులను తిరిగి నిందితులకే అప్పగించాల్సి వస్తోంది.

– పశువుల తరలింపు, రవాణాకు అనుమతిపత్రాలు తప్పనిసరి. సుదూర ప్రాంతాలకు వ్యవసాయ పనుల నిమిత్తం, పాడి అవసరాలకు తరలిస్తున్నామని ధ్రువీకరిస్తూ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ, వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై పశువుల అక్రమ రవాణాకు లైసెన్సు మంజూరు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

-రవాణా విషయంలో కనీస స్థాయిలో కూడా నిబంధనలు పాటించడం లేదు. ఒకే వాహనంలో 40 నుంచి 50 పశువులను కుక్కి తరలిస్తున్నారు. దారిపొడవునా కనీసం వాటికి ఆహారం వేయడం లేదు. దీంతో మార్గ మధ్యలో మృత్యువాతపడుతున్నాయి.