ArticlesNews

అక్షతాన్‌ సమర్పయామి

486views

క్షతం అంటే కొరత కలిగేది. అక్షతం అంటే పరిపూర్ణమైంది. బియ్యానికి కుంకుమ రాస్తే అవి అరుణాక్షతలు, పసుపు రాస్తే హరిద్రాక్షతలు. ‘అక్షతాన్‌ సమర్పయామి’ అంటూ దైవాన్ని భక్తితో పూజిస్తాం. పిన్నలను ఆశీర్వదిస్తాం. అక్షతలు ఒక దానితో మరొకటి కలవకుండా పొడి పొడిగా ఉండాలి. నీళ్లతో కలిపిన అక్షతలు పూజకి పనికి రావు. పసుపు హరిద్ర. అంటే లక్ష్మీదేవి. బియ్యం నారాయణుడు. బియ్యంలో పసుపును కలపడం అంటే, నారాయణుడి దగ్గరకు అమ్మవారిని చేర్చడం. అక్షతల్లో ఆవు నెయ్యి కూడా ఉంటుంది. నెయ్యి ప్రీతి పాత్రమైంది. అంటే లక్ష్మీదేవి నారాయణుణ్ణి లేదా నారాయణుడు లక్ష్మీదేవిని ప్రీతితో చేరుతారు.

కొరత లేకుండా పరిపూర్ణంగా జీవించాలని ఆశీర్వదించడమే అక్షతల ముఖ్యోద్దేశం. వీటిని అన్ని వేళ్లతో తీయకూడదు. కుడిచేతి బొటనవేలు, మధ్యవేలు ఉంగరంవేలు.. ఈ మూడు వేళ్లతోనే తీసి పూజించాలి. మహా భారతం దుష్యంతోపాఖ్యానంలో- ‘కణ్వమహర్షి ఆశ్రమంలో ప్రవేశిస్తున్న దుష్యంతుడి మీద పూలు అక్షతలుగా కురిశాయి’ అన్నాడు నన్నయ. అంటే ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని అర్థమవుతుంది.

నవగ్రహాల్లో ఒక్కో ధాన్యాన్ని ఒక్కో గ్రహానికి దాన వస్తువుగా చెబుతారు. చంద్రుడికి ప్రీతి కలిగించేది బియ్యం. చంద్రుడు మనసుకి అధినాయకుడు. ‘మనః కారకో ఇతి చంద్రః’ అన్నారు. మనసు, బుద్ధి, గుణం, వ్యసనం వీటన్నింటికీ చంద్రుడే కారణం. మన మీద అంతగా ప్రభావం చూపిస్తాడు. చంద్రుడి సంకేతమైన బియ్యానికీ అంతే ప్రభావం ఉంది. మంత్రం అంటే క్షయం లేనిది. అ-కారం నుంచి క్ష-కారం వరకూ ఉన్న బీజాక్షరాలతో మంత్రానికి ఉన్న ఆ శక్తి చేతిలోని అక్షతలకూ ఉంటుంది. ఆశీర్వదించే పెద్దల సాత్విక గుణం పిన్నలకు లభిస్తుంది. కనుకనే అక్షతలకు అంత ప్రాధాన్యత ఉంది.