News

మహా కుంభమేళా.. 45 కోట్ల మంది యాత్రికుల కోసం ఏర్పాట్లు

315views

ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 45 కోట్ల మంది యాత్రికులు, సాధువులు, పర్యటకుల కోసం సన్నాహాలు చేశామని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది. భోపాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూపీ జల్‌శక్తి మంత్రి స్వతంత్ర దేవ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. గతంలో కంటే అద్భుతంగా జరగనుందని చెప్పారు.

‘‘ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు దాదాపు 45కోట్ల మంది యాత్రికులు, సాధువులు, సన్యాసులు, పర్యటకులు రానున్నట్లు అంచనా వేస్తున్నాం. దీనిని స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షిత, డిజిటల్‌ కార్యక్రమంగా మార్చేందుకు యూపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒకేసారి వాడి పాడేసే ప్లాస్టిక్‌ రహితంగా నిర్వహించనున్నాం’’ అని యూపీ మంత్రి పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 3లక్షల మొక్కలు నాటామని, కుంభమేళా పూర్తైన తర్వాత కూడా వాటిని పరిరక్షిస్తామని చెప్పారు.

ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహా కుంభమేళా కొనసాగనుంది. ప్రతి 12 సంవత్సరాలకు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది యాత్రికులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటారు.