ArticlesNews

జాతీయోద్యమ ప్రదీప్తం గరిమెళ్ల సత్యనారాయణ సాహిత్యం

353views

( డిసెంబర్ 18 – గరిమెళ్ల సత్యనారాయణ వర్ధంతి )

“మాకొద్దీ తెల్ల దొరతనం” అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి… “దండాలు దండాలు భారత మాత” అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న ఈయన గేయాలన్నీ అప్పట్లో జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాలను ఉర్రూతలూగించాయి. దేశభక్తి కవితలు రాసి జైలుశిక్షను అనుభవించిన వారిలో ప్రప్రథముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి మారుపేరుగా నిలిచిన ఈయన రాసిన మాకొద్దీ తెల్ల దొరతనం అనే పాట ఆనాడు ప్రతి తెలుగువాడి నోటిలోనూ మార్మేగేది. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడిపెట్టిన మేటి కవి గరిమెళ్ళ వర్థంతి నేడు. ఈయనలాగా ప్రసిద్ధి చెందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.

ప్రజా పాటల త్యాగయ్యగా వాసికెక్కిన గరిమెళ్ళ సత్యనారాయణ జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామంలో 1893 జూలై 14వ తేదీన జన్మించారు. తల్లి సూరమ్మ, తండ్రి వేంకట నరసింహం. ఈయన ప్రాథమిక విద్య ప్రియాగ్రహారంలోనూ… విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరంలలో పై చదువులు అభ్యసించారు. బీఏ పూర్తయ్యాక గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా, విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగానూ పనిచేశారు. ఆ తరువాత… జాతీయోద్యమ స్ఫూర్తితో 1920లో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకి గరిమెళ్ళ “మా కొద్దీ తెల్లదొరతనం” పాటను రాశారు. గరిమెళ్ళ కేవలం రచయితే కాదు, గొప్ప గాయకుడు కూడా. తన కంచు కంఠంతో ఖంగున పాటలు కూడా పాడగలడు. అయితే, ఆ పాటను వ్రాసినందుకు గరిమెళ్ళకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు. శిక్షపూర్తి చేసుకుని జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఆయన మళ్ళీ ప్రజల మధ్య గొంతెత్తి పాడుతూ, ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకోసాగారు.

గరిమెళ్ళకు పెరుగుతున్న ప్రజాదరణను చూసిన బ్రిటీష్ ప్రభుత్వం, ఇతను బయట ఉండటంకంటే.. జైల్లో ఉండటమే మంచిదని భావించి అరెస్టు చేసి, కాకినాడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచింది. రెండు సంవత్సరాల జైలు శిక్షపడటంతో జైల్లో ఉండగా 1923లో ఆయన తండ్రి మరణించారు. అయితే గరిమెళ్ళ క్షమాపణ చెబితే, తండ్రిని చూసేందుకు వదిలిపెడతామని అన్నారట బ్రిటీష్ అధికారులు. దేశభక్తి జీర్ణించుకుపోయిన గరిమెళ్ళ క్షమాపణ చెప్పేది లేదని జైల్లోనే ఉండిపోయారు. జైల్లో వుండగా తమిళ, కన్నడ భాషలు నేర్చుకున్న గరిమెళ్ళ తమిళ, కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. 1921లో గరిమెళ్ళ “స్వరాజ్య గీతములు” పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు, బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. ఆంగ్లంలో కూడా కొన్ని రచనలు చేశారు. జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్న గరిమెళ్ళ , గృహలక్ష్మి పత్రిక సంపాదకుడిగా చేరారు కొంతకాలం తరువాత అక్కడ మానివేసి ఆచార్య రంగా, వాహిని పత్రికలలో సహాయ సంపాదకుడిగా చేరారు. ఆ తర్వాత ఆంధ్రప్రభలో, ఆనందవాణిలో, మరికొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా జీవనం సాగించారు.

స్వాతంత్ర్యం వచ్చినాక కూడా ప్రభుత్వాలు గరిమెళ్ళ సత్యనారాయణను పట్టించుకోలేదు. ఏవిధమైన సహాయము చేయలేదు. ఆ పరిస్థితులలో అయన అభిమానులు సహాయము చేయని ప్రభుత్వాన్ని నిందిస్తూ”మాకొద్దీ నల్ల దొరతనం”అనే పాటను వ్రాయమని చెప్పినా, దేశభక్తి గల గరిమెళ్ళ అందుకు ఒప్పుకోలేదు. దుర్భర దారిద్ర్యమును, అనారోగ్యాన్ని అనుభవిస్తూ 59 ఏళ్ల వయస్సులో 1952 డిశంబర్ 18న మరణించారు. చివరికి అయన అంత్యక్రియలు ఇరుగు పొరుగు వారు పూనుకొని పూర్తిచేశారు. నిజాయితీకి నిర్భీతికి మారు పేరుగా నిలిచిన గరిమెళ్ళ సత్యనారాయణ మన తెలుగుజాతికే కాదు యావత్ జాతికి స్మరణీయులు.