
అన్నమయ్య జిల్లా కాశినాయన మండలంలోని జ్యోతి క్షేత్రం జ్యోతిక్షేత్రం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. ఇక్కడ కొలువైన శ్రీఅవధూత కాశినాయనస్వామి మహిమాన్వితుడిగా ప్రసిద్ధి చెందారు. కాశినాయన 29వ ఆరాధన మహోత్సవాలు శనివారం, ఆదివారం ఘనంగా జరిగాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం బెడుసుపల్లె గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన కాశినాయన చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనకు అలవాటుపడ్డారు. ఆయన గురువు యతిరాజు గురవయ్య వద్ద ఆత్మజానం పొందారు. అక్కడి నుంచి వైఎస్‌ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలోకి ప్రవేశించి వరికుంట్ల, నాయునిపల్లె, గంగనపల్లె గ్రామాలకు చేరుకున్నారు. అక్కడ కొన్నేళ్ల పాటు చిన్నపిల్లలకు విద్యాబోధన చేస్తూ ఆధ్యాత్మిక చింతన కొనసాగించారు. ఆ సమయంలో వరికుంట్ల సమీపంలోని నల్లమల అడవుల్లోని జ్యోతిక్షేత్రంలో జ్యోతి నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. జ్యోతి నరసింహస్వామికి పూజలు చేస్తుండేవారు. సమీపంలోని గరుడాద్రి కొండ మీద కఠోరదీక్షతో తపస్సు చేశారు. అనంతరం అన్నదాన ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ వచ్చేవారు.
ఆలయాల పునరుద్ధరణకు కృషి
అవధూతగా మారిన కాశినాయన శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. చుక్కనీరు దొరకని గరుడాద్రి కొండమీద నీటిబావులు తవ్వించారు. గరుడాద్రి, అనంతరాయుడు, జ్యోతి, సిద్దేశ్వరం, లింగమయ్యకొండ, యోగానందలోని ఆలయాలను పునరుద్ధరించారు. కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో ఉన్న అహోబిలం వద్ద యోగానంద ఆశ్రమం స్థాపించి.. పశు సంపద, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
నరసింహస్వామి పాదాల చెంత సమాధి
వందేళ్లు జీవించిన కాశినాయన తన ఇష్టదైవమైన జ్యోతి నరసింహస్వామి పాదాల చెంత 1995 డిసెంబర్ 5న సమాఽధి అయ్యారు. ఆయన సమాధి చెందిన ప్రాంతంలో ఒక పురాతన మర్రిచెట్టు తనంతట తానే నేలవాలింది. ఆయన సేవిస్తూ వచ్చిన గోమాత కాశినాయన మరణాన్ని జీర్ణించుకోలేక మూడవ రోజున తనువు చాలించింది.
దేవాలయం ఏర్పాటు
కాశినాయన సమాధిపై అద్భుతమైన దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. 60 తెలుగు సంవత్సరాలకు ప్రతీకగా 60 రాతి స్తంభాలతో ‘నభూతో నభవిష్యతి’ అన్నట్లుగా దేవాలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆవు సమాధిని కూడా అందంగా నిర్మించారు. వంటశాలలు, భోజనశాలలు, వసతిగృహాల నిర్మాణాలతో జ్యోతిక్షేత్రం కళకళలాడుతోంది.
నిత్యాన్నదానం
కాశినాయన ఆశ్రమాన్ని దర్శించే భక్తులకు స్వామి దర్శనం ఎంత ఇష్టమో.. అక్కడ భోజనం చేసి రావడం అంత పవిత్రం. రోజూ వందల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని భోజనం చేస్తుంటారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో భక్త జనం భారీగా వస్తుంటారు. ఏడాది పొడవునా అన్నదాన కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. రైతులు తాము పండించిన పంటలో కాశినాయన పేరున తీసి ఉంచిన ధాన్యం, కూరగాయలు, పప్పుధాన్యాలు ఆశ్రమానికి తమకు తాముగా చేరవేస్తుంటారు. దీంతో అన్నదానం సజావుగా సాగుతోంది.
జ్యోతి ప్రజ్వలన
రెండు రోజుల పాటు జరిగిన కాశినాయన ఆరాధన మహోత్సవాలకు ఉమ్మడి వైఎస్‌ఆర్ జిల్లాతో పాటు ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శనివారం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.





