ArticlesNews

శివకేశవుల ప్రియమాసం

291views

( డిసెంబరు 16 – ధనుర్మాసం ప్రారంభం )

మాసాల్ని, రుతువుల్ని కూడా మాధవుడితో మమేకం చేసి, ఆయన మాహాత్మ్యాన్ని మననం చేసుకోవటం మన సంప్రదాయం. ఒక్కో మాసంలో, ఒక్కో రుతువులో ఒక్కో రీతిగా ఆరాధించి, ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి చెందే ధనుర్మాసం భక్తజనుల పాలిట దివ్యమాసం. మార్గశిరంలో పౌర్ణమి మరుసటి రోజు నుంచి ధనుర్మాసం అంటారు. సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించే మాసం కనుక ధనుర్మాసం. ఇది శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది.

ధనుర్మాసంలో ఆచరించే పూజలు, ఉపవాసాలు, వ్రతాలు సకల శుభాలను కలుగజేస్తాయంటారు. వసంత, హేమంతాలతో ప్రకృతి పరవశిస్తూ పరమాత్మకు కైమోడ్పులర్పించే కాలమిది. ధనుర్మాసాన్ని కోదండమాసం, చాపమాసం అని కూడా వ్యవహరిస్తారు. శ్రీమహా విష్ణువు అలంకారాల్లో కౌస్తుభ మణి విశేషమైనట్లు ఇతర మాసాల్లో ఇది శిరో భూషణమని- భారతంలో భీష్మాచార్యుడు నిర్వచించాడు. పురాణాలను అనుసరించి- పార్వతీదేవి శివుని కోసం చేసిన తపస్సు ఫలించి, వారి కల్యాణం జరిగింది ధనుర్మాసంలోనే. శ్రీకృష్ణుని వివాహం చేసుకోవాలనుకున్న రుక్మిణీదేవి నారదమునిని ఆశ్రయించి, ఆయన సూచన మేరకు కాత్యాయనీ వ్రతం చేసిందీ ఈ మాసంలోనే. శ్రీరంగనాథుని భక్తురాలు, ఆండాళ్‌గా పూజలందుకునే గోదాదేవి రోజుకొక భక్తిగీతం పాడుతూ చివరి రోజున స్వామిలో ఐక్యమైంది కూడా ఈ దివ్యమాసంలోనే!

విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన ఈ మాసంలో ఆ స్వామిని మధుసూదన నామంతో పూజిస్తారు. వివిధ వ్రతాలు ఆచరిస్తారు.

మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రదా
తవమూర్తి ప్రదానేన మమసంతు మనోరథా

అంటూ ధనుర్మాస పూజాఫలంగా తమ ధర్మబద్ధమైన అభీష్టాలను తీర్చమని ఆర్తితో ప్రార్థిస్తారు. నియమనిష్ఠలతో కూడిన ఇలాంటి వ్రతాలు, పూజల ఫలితంగా మనలో మానసిక, శారీరక నిగ్రహం ఇనుమడిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు వ్యాఖ్యానిస్తారు. ఏటా ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ‘వైకుంఠ ఏకాదశి’ లేదా ‘ముక్కోటి ఏకాదశి’ పేరుతో వేడుక చేస్తారు.

ప్రార్థనలు ఫలించాలంటే..
మన ప్రార్థనలో శరణాగతి, పరోపకారం, సమాజ హితం ప్రతిఫలించినప్పుడే పరమాత్మ స్పందిస్తాడు- అనటానికి ఆండాళ్‌ గీతాలే నిదర్శనం. ఉదాహరణకు ఆండాళ్‌ ఓ పాశురంలో ‘త్రివిక్రమస్వామిని ఉషఃకాలంలో స్నానం ఆచరించి భక్తిప్రపత్తులతో కీర్తిస్తే, నెలకు మూడు వర్షాలు కురుస్తాయి, జనావళికి తరగని సంపద లభిస్తుంది’ అని పాడుకుంది. మరో పాశురంలో ‘గోవిందా! గోకులనందనా! నీవు మా సేవలను స్వీకరించక తప్పదు. ఏడేడు జన్మలకు నీతో అనుబంధం నిలిచేట్లు, దాస్యం చేసేట్లు మమ్మల్ని అనుగ్రహించు’ అని వేడుకుంది. గోదాదేవి తిరుప్పావైలో ఇలాంటి మధురభక్తి భావనలెన్నో!

రెండూ దైవాన్ని చేరుకునే మార్గాలే!
వైష్ణవులు నెలరోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. విష్ణుమూర్తి కథలు వినటం, విష్ణుసహస్రనామాల పారాయణం, విష్ణు ఆలయాల సందర్శనం, తిరుప్పావై పఠనంతో తరిస్తారు. పరమశివుని భక్తులకు కూడా ఈ మాసం పవిత్రమైందే! తిరుప్పావై విష్ణువుని కీర్తిస్తే, తిరువెంబావై శివుని కీర్తిస్తుంది. ఈ మాసంలో శివాలయాల్లో తిరువెంబావై, వైష్ణవాలయాల్లో తిరుప్పావై గానం చేస్తారు. వైష్ణవం, శైవం భిన్నం కాదు.. రెండూ దైవాన్ని చేరుకునే మార్గాలేనని ధనుర్మాసం గుర్తుచేస్తుంది.

తరింపజేసే తిరుప్పావై..
ధనుర్మాసం అనగానే గోదాదేవి ఆశువుగా ఆలపించిన తమిళ తిరుప్పావై గుర్తొస్తుంది. గోదాదేవిని ఆండాళ్, చూడికొడుత్తనాచ్చియార్‌ అని, తిరుప్పావై గీతాలను పాశురాలని పిలుస్తారు. గోదా ధనుర్మాస వ్రతం ఆచరించి శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందింది. ఆండాళ్‌ లలిత సంగీత లయ విన్యాసాలతో కూర్చిన పాశురాలలో, పరమాత్మపై భక్తి, ప్రేమలు సౌరభిస్తాయి. అందుకే సాక్షాత్తూ ఆ దేవదేవుడు ఆమె ప్రేమపూర్వక పాశురాలను హారాలుగా ధరించాడు. ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు. కృష్ణదాసి అయిన గోదా మనసు ఎప్పుడూ మాధవ మందిరంలోనే! ఆమె ఒక్కొక్క కవిత స్వామికి సమర్పించిన వసివాడని సుమం, ఆయన సన్నిధిలో వెలిగించిన ఆరిపోని దీపం. అందుకే ఆ పరమపావని పాశురాలకు పరవశుడై భావకవితా చక్రవర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి తిరుప్పావైని ‘సిరినోము’ పేరుతో అనువదించారు. తిరుప్పావైకి శ్రీవ్రతం, మేలినోము అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ గీతాలు మనలోని భక్తిభావాలను, సాత్త్విక ప్రవృత్తులను మేల్కొలపటానికి ఉపయోగపడతాయి.

ఆధ్యాత్మిక సాధనలకు అనువైన మాసం
భక్తులకే కాదు జ్ఞానులకూ ధనుర్మాసం ప్రియమాసం. ఇది ఆధ్యాత్మిక సాధనలకు అనువైన సమయమని సాధకుల భావన. యోగశాస్త్రం ప్రకారం ధనువు అంటే వెన్నెముక. దాన్నే మేరువు అంటారు. పారమార్థిక సాధనకు సంకేతం ధనుస్సు. ఈ నెల రోజులు ఏ కాస్త ప్రయత్నించినా మనసును ధ్యానంపై ఏకాగ్రం చేయవచ్చని అనుభవజ్ఞులు చెబుతారు. అందుకే వారు తమకు ధ్యానసాధనే ధనుర్మాస వ్రతం అంటారు. ప్రకృతి పరంగా తామస గుణంలోకి వెళ్లే శరీరాన్ని, బుద్ధిని సాత్త్వికం దిశగా మరలించే ఎన్నో భక్తి, జ్ఞాన ప్రక్రియలకు ఈ మాసం ఆలవాలం.

వేంకటేశ్వరుడి సన్నిధిలో విశేష పూజలు
ధనుర్మాసంలో శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ఏడుకొండలస్వామికి జరిగే ఉపచారాలు నిత్య పూజల కన్నా విభిన్నంగా ఉంటాయి. ధనుర్మాసం ప్రవేశించగానే తిరుమలలో ఆలయశుద్ధి చేసి ధనుర్మాస పూజ నిర్వహిస్తారు. స్వామివారికి అర్చన, నివేదన అనంతరం గోదాదేవి రచించిన పాశురాన్ని పారాయణ చేస్తారు. రోజుకొకటి చొప్పున ముప్పై పాశురాలు పఠిస్తారు. అలాగే ఈ మాసంలో స్వామివారికి సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున తిరుమల ఆనంద నిలయంలో వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. తిరిగి వైకుంఠ ద్వాదశి తెల్లవారుజామున మూసేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీ వేంకటేశ్వరుడు తిరువీధుల్లో స్వర్ణరథంలో ఊరేగుతాడు.