
సంభాల్ లో ముస్లింలు అధికంగా నివసించే ఓ పురాతన ఆలయంలో శివలింగం, హనుమంతుని విగ్రహంతో పాటు నంది విగ్రహం కూడా లభించాయి. 1978 లో ఈ ఆలయాన్ని మూసేశారు. తాజాగా స్థానిక అధికారుల సారథ్యంలో 30 ఏళ్ల తర్వాత ఈ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా భక్తులు జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఈ దేవాలయం తిరిగి తెరవడంతో స్థానికులు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు. థానా నఖాసా ప్రాంతంలోని మొహల్లా ఖగ్గు సరాయ్ ప్రాంతంలో ఈ దేవాలయం వుంది. మతపరమైన ఉద్రిక్తతల కారణంగా 30 ఏళ్ల క్రితం ఈ దేవాలయం మూసేశారు. ఇప్పుడు ఈ ఆలయం తిరిగి తెరవడంతో దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. అప్పట్లో ఈ దేవాయంలో నిత్య పూజలు, అర్చలు, భజనలు, కీర్తనలు రోజూ జరిగేవని తెలిపారు. కానీ… గొడవలతో ఈ దేవాలయాన్ని మూసేశారు.
కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు స్వయంగా ఆలయాన్ని తెరిచి, శుభ్ర చేశారు. పోలీసులే స్వయంగా ఆలయాన్ని శుభ్రం చేశారు. ఇది ఆక్రమణలకు గురవుతోందన్న ప్రజల ఫిర్యాదుతో అధికారులు రంగప్రవేశం చేసి, తిరిగి తెరిచారు. ఈ సమయంలో దేవతా విగ్రహాలతో పాటు ఓ పురాతన బావిని కూడా అధికారులు గుర్తించారు. ఆక్రమణలకు సంబంధించిన సమాచారం తమకు అందిందని, ఈ సమయంలో తనిఖీలు చేస్తుండగా… దేవాలయం ఉనికి బయట పడిందన్నారు. ఇప్పుడు దేవాలయం మొత్తం శుభ్రం చేస్తున్నామని, దాని చుట్టూ వున్న ఆక్రమణలను కూడా తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు.




