
( డిసెంబరు 14 – దత్త జయంతి )
మార్గశిర పౌర్ణమి దత్త జయంతి. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో అవతారమెత్తిన దివ్యమూర్తి. ఆ స్వామి మేడి చెట్టు (ఔదుంబర్) నీడలో కొలువై ఉంటాడు. మూడు శిరస్సులు, ఆరు చేతులు కలిగిన దత్తాత్రేయుని భిక్షువు రూపం అహంకార నాశనానికి ప్రతీక. సదా ఆయనను వెన్నంటి ఉండే గోవు ధరణికి, శునకాలు వేదాలకు ప్రతీకగా భావిస్తారు. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మ పురాణం, రామాయణ, భారత, భాగవతాల్లో దత్తాత్రేయుని ప్రస్తావన ఉంది. ముఖ్యంగా శ్రీగురు చరిత్రలో దత్తాత్రేయుని అవతారాల గురించి వివరంగా లిఖితమైంది. ఆధ్యాత్మిక ప్రేరణ కల్గించే ఈ గ్రంథంలో దత్తాత్రేయుని గురుతత్వం, దైవత్వం, ఆధ్యాత్మిక బోధనలు ఉన్నాయి. దత్త జయంతిని పురస్కరించుకొని భక్తులు శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తారు. ఇలా చేయటం వల్ల పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
దత్తాత్రేయుడు తన ఆత్మనే గురువుగా భావించినప్పటికీ తనకు ఎంతో కొంత జ్ఞానాన్ని ప్రసాదించిన 24 చరాచరాలను గురువులుగా భావించాడు. అవి- 1.భూమి 2.జలం 3.అగ్ని 4.వాయువు 5.ఆకాశం 6.చంద్రుడు 7.సూర్యుడు 8.పావురం 9.కొండచిలువ 10.తేనెటీగ 11.తేనెటీగల పెంపకందారుడు 12.గద్ద. 13.సముద్రం 14.చిమ్మట కీటకం 15.ఏనుగు 16.జింక 17.చేప 18.వేశ్య 19.శిశువు 20.కన్య 21.సర్పం 22.విలుకాడు 23.సాలీడు 24.గొంగళిపురుగు
దత్తాత్రేయుని ఆలయాలు: దేశంలో అనేక ప్రాంతాల్లో దత్తాత్రేయుని ఆలయాలున్నాయి. పిఠాపురం, శ్రీశైలం, వారణాసి, మాహుర్, నరసింహవాడి, గిరనార్, కారంజా ఔదుంబర్, గాణగాపూర్, కురువపురం మొదలైనవి ప్రముఖ దత్త క్షేత్రాలు. దత్తాత్రేయుని ఆలయాల్లో వినిపించే ‘దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా’ మంత్రం భక్తుల హృదయాల్లో ప్రశాంతత ఆవరిస్తుంది.




