ArticlesNews

నికార్సైన సత్యాగ్రహి పొట్టి శ్రీరాములు

376views

( డిసెంబర్‌ 15 – పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం )

తెలుగువారికి ప్రత్యక రాష్ట్రం కోరి.. దానికోసం చివరి వరకు పోరాడి ఆహుతి అయిన అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన 1901 మార్చి 16న కటిక పేదరికం అనుభవిస్తున్న పొట్టి గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు మూడవ సంతానంగా జన్మించాడు. ఆయన విద్యాభ్యాసం మద్రాసులో జరగగా 1920వ సంవత్సరంలో శానిటరీ ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పొందారు. 1924 నుంచి 1929 మధ్య కాలంలో రైల్వే శానిటరీ ఇంజనీరుగా పని చేశారు. ఆయనకు 1926లో తన మేనకోడలు సీతమ్మతో వివాహం జరిగింది. అయితే తొలి కాన్పులో తల్లి, బిడ్డ మరణించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయన మాతృమూర్తి కన్నుమూశారు. 28 ఏళ్ల వయసుకే జీవితంలో ‘నా’ అనే వాళ్లంతా ఒక్కక్కరే తనువు చాలించటంతో శ్రీరాములు ఒంటరివాడైపోయాడు. దీంతో తనకున్నవన్నీ పేదలకు పంచి, స్వరాజ్య సంగ్రామంలో పాల్గొనడానికి, సబర్మతీ ఆశ్రమానికి వెళ్లారు. 1930 ఏప్రిల్‌ 1న గాంధీజీని కలిసి, సత్యాగ్రహిగా శిక్షణ పొందాడు.

పొట్టి శ్రీరాములు తొలిసారి నాసిక్‌లో కారాగారవాసం అనుభవించారు. జైలులోనూ ఆయన సత్యాగ్రహిగా జీవించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. 1934 జనవరి 15న ఉత్తర బీహార్‌‌లో వచ్చిన భూకంపం కారణంగా సర్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు బీహార్‌ వెళ్లి.. అక్కడి సీతామోర్‌ తాలూకాలో నెలల తరబడి సేవాకార్యక్రమాలు చేశారు. తిరిగి గుజరాత్‌ చేరి.. సత్యాగ్రహ ఆశ్రమంలో సేవలందించి.. కొన్నాళ్ళకి తారవాడలోని శ్రమజీవి ఆశ్రమంలో నివాసం ఏర్పరచుకొని, వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహించాడు. ఇంతలో మారెళ్ళ గ్రామంలో మేనమామ అవసానదశలో ఉన్నట్లు వార్త రావటంతో శ్రీరాములు అక్కడకు చేరాడు. అక్కడే ఆయన తొలిసారి.. నిరాహార దీక్ష చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నందుకు 1943 జనవరి 26న మరోసారి అరెస్టై కొన్నాళ్లు రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో, మరొకొంత కాలం బళ్ళారి సెంట్రల్‌ జైలులో, ఆలీపూర్‌ క్యాంప్‌ జైల్లో శిక్షలు అనుభవించారు. జైలులో ఉండగా, స్వయంగా ఖైదీల మల మూత్రాల్ని ఎత్తి, మరుగుదొడ్లు కడిగి, జైలును శుభ్రపరచి, సత్యాగ్రహానికి కొత్త అర్థం చెప్పాడు. జైలు నుండి విడుదలయ్యాక నెల్లూరు జిల్లాలో అంటరానితన నిర్మూలనకు శ్రీరాములు పూనుకున్నారు. ‘అంటరానితనం వద్దు’ అనే స్లోగన్లు రాసిన అట్టలను మెడలో కట్టుకుని వీధుల వెంట తిరిగి ప్రచారం చేసేవారు. అదే సమయంలో వితంతు పునర్వివాహం, యానాదులకు సహపంక్తి భోజనాలు, కులాలకు అతీతంగా అనాధల అంతిమ సంస్కారాలు చేశారు. నెల్లూరు వేణుగోపాల స్వామి గుడిలో హరిజనులకు ప్రవేశం కావాలంటూ 1946 మార్చి 7న నిరాహార దీక్ష ప్రారంభించాడు. చివరకు ధర్మకర్తలు అంగీకరించడంతో మార్చి 16న తన దీక్ష విరమించారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా శ్రీరాములు పేదల పక్షాన పోరాటాలు చేశారు. రేషనింగ్‌ విధానంలో లోపాలని తొలగించమని ప్రభుత్వాన్ని కోరిన కారణంగా.. 1947 అక్టోబర్‌లో నాటి మద్రాసు ప్రభుత్వం ఆయనను అరెస్ట్‌ చేసి, జైలుకు పంపించింది. గాంధీజీ వర్థంతి జనవరి 30ని పీడిత సేవాదినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మద్రాసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు పర్యాయాలు నిరాహార దీక్ష చేశారు. ఇక.. శ్రీరాములు సాగించిన సత్యాగ్రహ పోరాటాలలో చివరిది ఆంధ్రరాష్ట్ర సాధనా పోరాటం. ప్రఖ్యాత దేశభక్తుడైన బులుసు సాంబమూర్తి అద్దె ఇంట్లో 1952 అక్టోబర్‌ 19న శ్రీరాములు దీక్ష ఆరంభమైంది. 58 రోజుల పాటు ఈ దీక్ష నిరాటంకంగా సాగింది. చివరకు.. 1952 డిసెంబర్‌ 15 రాత్రి 11. 23 నిముషాలకు శ్రీరాములు ఆంధ్రరాష్ట్ర సాధనా మహాయజ్ఞంలో తుదిశ్వాస విడిచారు. ఆయన బలిదానం తర్వాత అంతిమంగా 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం అవతరించింది.ఆయన సేవలకు గుర్తుగా పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది.

నికార్సైన సత్యాగ్రహి, పీడిత ప్రజల పక్షపాతి, సమాజసేవకుడు, అసలైన గాంధేయవాది.. అన్నింటికీ మించి గొప్ప దేశభక్తుడైన శ్రీరాములు జీవితం నేటి తరానికి గొప్ప ఆదర్శం. అమరజీవి వర్థంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి.