News

అంతర్జాతీయ సంస్థలు నోరు విప్పవా? సాధ్వీ రితింభర

184views

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ సమీపంలో ఢిల్లీ సివిల్ సొసైటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సుమారు 200 సామాజిక, సాంస్కృతిక సంస్థల నుంచి పెద్ద సంఖ్యలో హిందువులు హాజరయ్యారు. అలాగే ఈ నిరసన ప్రదర్శనలో సాధులు, సంతులు, స్వామీజీలు కూడా పాల్గొన్నారు. హిందువులకు భద్రత కల్పించాలని భారత ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. అలాగే హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. హిందువులపై ఊచకోత ఆపండి.. ముస్లిం ఛాందసుల దురాగతాలను సహించం’’ అంటూ నినాదాలిచ్చారు. ఇంత జరుగుతున్నా… అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్య సమితి ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు.

అంతర్యుద్ధం అంటూ జరిగితే ఎక్కువగా నష్టపోయేది సాధు సంతులు, మహిళలేనని సాధ్వీ రితింభర అన్నారు. బంగ్లాదేశ్ లో చిన్మయ్ కృష్ణదాస్ వంటి సాధువులు జైలులో వున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బంగ్లాదేశ్ లో మహిళలు సామూహిక అత్యాచారం లాంటి వాటిని ఎదుర్కొంటున్నారని, అయినా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయని సాధ్వీ నిప్పులు చెరిగారు. చిన్న చిన్న ఘటనలపై ఈ సంస్థలు ఒంటికాలుపై లేస్తాయని, బంగ్లాదేశ్ లో ఇంత జరుగుతున్నా మౌనంగా ఎందుకున్నారని సూటిగా నిలదీశారు.

ఇక.. బౌద్ధ సన్యాసి భంటే రాహుల్ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. బంగ్లాదేశ్ లో బౌద్ధ సన్యాసులు, సాధువులపై అకృత్యాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.బంగ్లాదేశ్‌లో మునుపెన్నడూ లేని విధంగా హిందువులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని రాజ్యసభ సభ్యుడు, కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ అన్నారు. బంగ్లాదేశ్ ఛాందసవాదులను కూడా ఆయన హెచ్చరించారు.