News

2035 కల్లా ‘భారత్‌ అంతరిక్ష కేంద్రం’ సిద్ధం: కేంద్ర మంత్రి

223views

భారతదేశం 2035 కల్లా తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధం చేసుకోనుందని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ పేర్కొన్నారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలుమోపే అవకాశం ఉందని తెలిపారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరిక్ష మంత్రిత్వశాఖలు ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలపై విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘చంద్రునిపై భారతీయ వ్యోమగామిని దింపాలనే ప్రణాళికలతో అంతరిక్ష పరిశోధనలో ప్రధాన మైలురాళ్లను సాధించడానికి సిద్ధంగా ఉంది. 2035 నాటికి భారత్‌ సొంత స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటుచేసుకుంటుంది. అంతరిక్ష కేంద్రాలు కలిగిఉన్న అమెరికా వంటి దేశాల సరసన త్వరలో భారత్‌ నిలవనుంది’’ అని ఆయన తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర ‘‘గగన్‌యాన్ మిషన్‌’’కు సంబంధించిన విషయాలను సైతం వెల్లడించారు. 2024 చివరికి లేదా 2026 ప్రారంభంలో, మొదటి భారతీయ వ్యోమగామి గగన్‌యాన్ మిషన్ కింద అంతరిక్షంలోకి వెళతారని ఆయన వెల్లడించారు.

అంతేకాకుండా భారత్‌ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్‌ ఓషన్‌ మిషన్‌ సముద్రయాన్‌లో భాగంగా మత్స్య-6000 జలాంతర్గామిని రూపొందిస్తున్నామన్నారు. జలాంతర్గామిలో ముగ్గురు కూర్చొని 6 కిలోమీటర్ల సముద్రపు గరిష్ట లోతుకు (6,000 మీటర్లు) చేరుకోవచ్చని.. దాంతో సముద్ర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయొచ్చని తెలిపారు. సముద్రగర్భ అన్వేషణలో తోడ్పడే మానవ సహిత జలాంతర్గామి ఇదేనని చెప్పారు. ఈ నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) అభివృద్ధి చేసిందన్నారు. ఇది ప్రారంభమైతే భారతదేశ మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్‌గా దీనికి గుర్తింపు దక్కనుందని పేర్కొన్నారు.