News

వక్ఫ్‌ తనవిగా చెబుతున్న ఆస్తుల వివరాలు ఇవ్వండి : రాష్ట్రాలను కోరిన పార్లమెంటరీ కమిటీ

253views

వక్ఫ్‌ సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ… అనధికారికంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని వక్ఫ్‌ ఆస్తులపై దృష్టి సారించింది. వాటిపై వివరాలను అందించాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కమిటీ కోరింది. ఈ ఆస్తులకు సంబంధించిన వాస్తవ, తాజా వివరాలు సమర్పించాలని కోరింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనధికారిక పద్ధతుల్లో వక్ఫ్‌ ఆస్తులు, భూములను తమ స్వాధీనంలో ఉంచుకున్నాయని సచార్‌ కమిటీ తన నివేదికలో పేర్కొన్న విషయాన్ని కమిటీ ప్రస్తావించింది. అలాగే, వక్ఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 40 ప్రకారం.. వక్ఫ్‌బోర్డు తనవిగా (క్లయిమ్‌) చెబుతున్న భూముల వివరాలూ సమర్పించాలని కోరింది. రాష్ట్రాలకు చెందిన వేర్వేరు వక్ఫ్‌బోర్డులతో కలిపి 2005–06లో సచార్‌ కమిటీ ఏర్పాటైంది. వక్ఫ్‌ ఆస్తులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆక్రమణలకు గురైనట్టు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పనికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలను పరిశీలించడానికి ఈ కమిటీ ఏర్పాటైంది. తమ దృష్టికి వచ్చిన ఆరోపణలను పరిశీలించి తన నివేదికను కమిటీ సమర్పించింది. ఢిల్లీలో అత్యధికంగా 316 వక్ఫ్‌ ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయని నాడు గుర్తించింది. ఇక.. రాజస్థాన్‌లో 60, కర్ణాటకలో 42, మధ్యప్రదేశ్‌లో 53, యూపీలో 60, ఒడిశాలో 53 ఆస్తులు పరాధీనమయ్యాయని తేల్చింది. అప్పటి సచార్‌ కమిటీ నివేదికను తాజాపరచాలని పార్లమెంటరీ కమిటీ నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తనకు కావాల్సిన సమాచారాన్ని కమిటీ తెప్పించుకొంటోంది. అలాగే, ఆస్తులపై యాజమాన్యం వంటి విషయాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, వక్ఫ్‌బోర్డుకు మధ్య ఏమైనా న్యాయసంబంధ వివాదాలుంటే వాటి వివరాలూ అందించాలని సూచించారు