
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది జరగనున్న మహాకుంభమేళాకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు, సాధువులు సహా దాదాపు 40 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళాను నిర్వహించనున్నారు. ఈ జాతర కోసం ప్రత్యెక రైళ్ళను నడుపుతున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ప్రయాగ్ రాజ్ కు 140 సాధారణ రైళ్లు నడుస్తూ ఉంటాయి. అయితే ఈ మహా కుంభ మేళా సమయంలో.. ఆరు ప్రధాన పండగల సమయంలో రైల్వే శాఖ 1,225 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు వెల్లడించింది. ప్రయాగ్ రాజ్ లో స్నానం చేసి అనంతరం అయోధ్య, కాశీని సందర్శించాలనుకునే యాత్రికుల కోసం ప్రయాగ్‌రాజ్, ప్రయాగ్, అయోధ్య, వారణాసి, రాంబాగ్ మొదలైన ప్రధాన స్టేషన్‌లలో ఈ రైళ్ళు ఆగే విధంగా తమ సేవలను ప్రయాణీకుల సౌకర్యం కోసం అందించే విధంగా రైల్వే సిబ్బంది ఆలోచిస్తుందని రైల్వే ప్రతినిధి తెలిపారు.
చిత్రకూట్ సందర్శించాలనుకునే యాత్రికుల కోసం, ఝాన్సీ, బందా, చిత్రకూట్, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్, ఫతేపూర్, గోవింద్‌పురి , ఒరాయ్‌లను కవర్ చేసే మరో రింగ్ రైలు సర్వీస్ ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.
స్పెషల్ ట్రైన్ షెడ్యుల్ వివరాలు
ఈ 1,225 ప్రత్యేక రైళ్లలో.. 825 తక్కువ మార్గాల్లో నడప నుండగా.. 400 స్పెషల్ ట్రైన్స్ దూర ప్రాంతాల కోసం రిజర్వ్ చేసినట్లు తెలిపారు. ఇప్పుడు నడప నున్న రైళ్ళ సంఖ్య 2019 సమయంలో నడిచిన రైళ్ల కంటే దాదాపు 177 శాతం ఎక్కువ అని చెప్పారు. అప్పుడు 533రైళ్ళు తక్కువ దూరంలో నడపగా.. 161 దూరంలో ప్రయాణించే రైళ్ళు నడిపిమ్చినట్లు రైల్వే ప్రతినిధి తెలిపారు.





