
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో హిందువుల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే పలు ఆందోళనకర పరిణామాలు సంభవించాయి. హిందూ ఆలయాలపై దుండగులు దాడులు చేశారు. హిందువులపై దాడి చేయడంతోపాటు వారి దుకాణాల్లో లూటీకి పాల్పడ్డారు. ఆపైన ఇస్కాన్‌పై నిషేధం విధించాలంటూ ర్యాలీ చేపట్టారు.
హిందువులు అత్యధికంగా నివసించే కొత్వాలి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ప్రార్థనల అనంతరం చోటుచేసుకున్న ఘటనలివి. జమాతె ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ)కి చెందినట్లుగా భావిస్తున్న కొందరు చిట్టగాంగ్‌లోని రాధా గోవింద, సంతానేశ్వరి మాత్రి ఆలయాలపై దాడులకు పాల్పడ్డారు. మైనారిటీ వర్గం ప్రజలపై దాడులు చేశారు. హిందువులు నిర్వహించే దుకాణాలను ధ్వసం చేశారు.
భయాందోళనలకు గురైన బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. అనంతరం దుండగులు ఇస్కాన్‌ను నిషేధించాలంటూ ర్యాలీ చేపట్టారు. ఇన్ని జరుగుతున్నా స్థానిక పోలీస్, ఆర్మీ అధికారులు వారిని తమను కాపాడేందుకు ఏమాత్రం ప్రయతి్నంచకుండా ప్రేక్షకపాత్ర వహించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోయాయి. చిన్మయ్ దాస్ అరెస్ట్‌పై హిందువులు నిరసనలు తెలపడంతో దాడులు మరింతగా పెరిగాయి.
చిన్మయ్ దాస్ బ్యాంక్ అకౌంట్ నిలిపివేత
హిందూ మత పెద్ద చిన్మయ్ దాస్‌కు చెందిన వివిధ బ్యాంకు అకౌంట్లను బంగ్లాదేశ్ ఆర్థిక విభాగం స్తంభింపజేసింది. రాజద్రోహం నేరం కింద ఈ నెల 25న పోలీసులు చిన్మయ్ దాస్‌ను అరెస్ట్ చేయడం తెలిసిందే. దాస్‌తోపాటు ఇస్కాన్ సంబంధిత వ్యక్తులకు చెందిన మరో 17 అకౌంట్లను కూడా నెల రోజుల పాటు సీజ్ చేస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది. ఈ బ్యాంకు అకౌంట్ల లావాదేవీలన్నిటినీ నిలిపివేయాలని, ఇప్పటి వరకు జరిగిన లావాదేవీల వివరాల్ని అందజేయాలని ఆదేశించినట్లు పేర్కొంది.





