
విజయవాడ ఇంద్ర కీలాద్రిపై డిసెంబర్ 21 నుంచి 25వ తేదీ వరకు జరిగే భవానీ దీక్షల విరమణలకు అవసరమైన అన్ని పనులు సకాలంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని దుర్గగుడి ఈవో కె.ఎస్.రామరావు పేర్కొన్నారు. కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి, ఘాట్ రోడ్డులోని మొదటి మలుపు వద్ద క్యూలైన్ పనులను ప్రారంభించారు. తొలుత కెనాల్ రోడ్డులోని వినాయకుడి గుడి వద్ద పనులకు ఆలయ వైదిక కమిటీ సభ్యులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షణలో ఈవో రామరావు కొబ్బరి కాయ కొట్టి పనులు ప్రారంభించారు. దీక్ష విరమణలకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే భవానీల కోసం క్యూలైన్లు, జల్లు స్నానాలు, ప్రసాదాల కోసం కౌంటర్లు ఏర్పాటుకు అవసరమైన టెండర్లు పూర్తయ్యాయన్నారు. ఈ ఏడాది మహా మండపం , గోశాల మధ్య ఖాళీ స్థలంలో హోమగుండాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నామన్నారు. ఈఈ టి.వైకుంఠరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.





