News

ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ నుంచి కే-4 క్షిపణి పరీక్ష

245views

ఇటీవలే ప్రారంభించిన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ నుంచి భారత నౌకాదళం.. కే-4 బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించింది. విశాఖపట్నం సమీపంలోని బంగాళాఖాతంలో ఈ పరీక్ష నిర్వహించినట్టు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరీక్ష ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఫలితాన్ని క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సబ్‌మెరైన్‌ నుంచి ప్రయోగించగల ఈ అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అధునాతన కే-4 బాలిస్టిక్‌ క్షిపణి (ఎస్‌ఎల్‌బీఎం) 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 6,000 టన్నుల బురువున్న ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ నుంచి కే-4 క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారి. గతంలో వీటిని సబ్‌మెర్సిబుల్‌ పాంటూన్ల నుంచి మాత్రమే పరీక్షించారు. తీర ప్రాంత రక్షణను బలోపేతం చేసుకునే ప్రక్రియలో భాగంగా భారత నౌకాదళం కే-4 క్షిపణి పరీక్ష నిర్వహించింది. ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ భారత నౌకాదళంలో ఉన్న రెండో అణు జలాంతర్గామి. ఈ ఏడాది ఆగస్టు 29న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దీన్ని ప్రారంభించారు. ఇది అణ్వస్త్రాలు కలిగిన బాలిస్టిక్‌ క్షిపణులను మోసుకెళ్లగలదు. భారత్‌కు చెందిన తొలి అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌లో 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఎస్‌ఎ్‌సబీఎన్‌ కే-15 క్షిపణులు ఉన్నాయి. కాగా, వచ్చే ఏడాది భారత నౌకాదళానికి అందుబాటులోకి రానున్న మరో అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిధమన్‌లోనూ కే-4 క్షిపణిని చేర్చేందుకు తాజా పరీక్ష ఉపయోగపడనుంది.