ArticlesNews

హైలైట్స్ ఆఫ్ హౌడీ మోడీ

1kviews

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ హౌస్టన్ పర్యటన ప్రవాస భారతీయులు అందరికీ బూస్ట్ నిచ్చింది.

ఈ సభలో అడుగడుగునా ఆద్యంతము భారత్ మాతాకీ జై, వందేమాతరం నాదాలతో, మోడీ నామస్మరణతో అమెరికాలోని హోస్టన్ పట్టణము మారుమోగిపోయింది.

భారత ప్రధాన మంత్రి అమెరికా పర్యటనకు వస్తున్నారు అంటే అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ లాంటి పేపర్లలో ఎక్కడో ఒక పేజీలో ఒక మూలన వచ్చేటువంటి వార్త నుంచి ఈరోజు సాక్షాత్తు అగ్రరాజ్యానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి యొక్క సభకు రావడంతో ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యంతో ఎదురు చూసింది.

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హోస్టన్ లోని టెక్సస్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘హౌడీ మోడీ’ సభకు 50,000 మందికిపైగా ప్రవాస భారతీయులు హాజరు అవటమే కాకుండా అమెరికా 50 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సెనేటర్లు, గవర్నర్లు అందరూ కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికారు.

“హౌడీ మోడీ” సభలో ప్రధాని మోడీ ప్రసంగంలోని కొన్ని అంశాలు :

130 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం….

 

ఈ సభలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ ప్రవాస భారతీయులు అందరికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని పరిచయం చేస్తూ, మిత్రులారా ఈరోజు మన ముందుకి ఒక విశిష్ట అతిథి వచ్చారు. వారికి పరిచయం అవసరం లేదు. ఈ గ్రహం మీద వారి పేరు ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. ప్రపంచ రాజకీయాలలో అంతర్జాతీయ వేదికలో ప్రతి చోట వారి పేరు వస్తుంది. సీఈవో నుంచి కమాండర్ ఇన్ చీఫ్ వరకు, వార్డు రూమ్ నుంచి ఓవల్ ఆఫీస్ వరకు, స్టూడియో నుంచి ప్రపంచ వేదిక వరకు, ఆర్థిక రాజకీయాల నుంచి రక్షణ రాజకీయాల వరకు వారు ఈ దేశంలో తనదైన ముద్ర వేశారు. అటువంటి వారు ఈ రోజున మనతో ఉన్నారు. ఇది మనకి గర్వకారణం. తరచుగా వారిని కలిసేటువంటి అవకాశం నాకు దక్కింది. వారిని కలిసిన ప్రతిసారీ వారిలో నాకు ఒక మంచి స్నేహ గుణం, శక్తి  కలిగిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్ అని,   వారి యొక్క నాయకత్వంలో అమెరికా భవిష్యత్తులో గొప్ప దేశంగా తయారు చేయాలి అని మన ముందుకు విచ్చేశారు. అలాగే వారు ఇప్పటికే అమెరికాని ఆ విధంగా చేసి చూపించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థని శక్తిమంతం చేశారు. మిత్రులారా, వారు భారతీయులతో చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే నేను చెబుతున్నాను “అబ్ కీ బార్  ట్రంప్ సర్కార్”. వారిని నేను మొదటిసారి కలిసినప్పుడు వారు చెప్పారు శ్వేత సౌధంలో మీకు ఒక మంచి నిజమైన స్నేహితుడు ఉన్నారు అని. ఈరోజు మీయొక్క రాక దానిని ఋజువు చేస్తోంది. గడిచిన ఈ కొన్ని సంవత్సరాలలో స్నేహపూర్వక వాతావరణంలో మన రెండు దేశాలు అత్యంత అభివృద్ధి సాధించాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి….

మిస్టర్ ప్రెసిడెంట్! ఈరోజు హ్యూస్టన్ లో ఈ సహృద్భావ వాతావరణంలో రెండు అతిపెద్ద డెమోక్రటిక్ దేశాల గుండె చప్పుడును మీరు వినవచ్చు. మన రెండుగొప్ప దేశాల మిత్రత్వంలోని శక్తిని, లోతుని ఈ సందర్భంలో మీరు అనుభూతి చెందవచ్చు.

అన్ని సంబంధాల ద్వారా మన బంధము హౌస్టన్ నుంచి హైదరాబాద్ వరకు బోస్టన్ నుంచి బెంగళూరు వరకు లాస్ ఏంజెల్స్ నుంచి లూధియానా వరకు చికాగో నుంచి సిమ్లా వరకు న్యూజెర్సీ నుంచి న్యూఢిల్లీ వరకు లక్షల మంది కోట్ల మందికి టీవీ ద్వారా చేరింది  ఇది భారతదేశంలో ఆదివారం రాత్రి పది గంటలు అయినప్పటికీ. ప్రపంచంలోని నలుమూలల నుంచి కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ యొక్క చారిత్రక ఘట్టానికి సాక్ష్యాలుగా నిలిచి ఉన్నారు.

మిస్టర్ ప్రెసిడెంట్! 2017లో నన్ను మీరు మీ ఫ్యామిలీకి పరిచయం చేశారు. అలాగే ఈ రోజు నా ఈ కుటుంబాన్ని మీకు  పరిచయం చేసే గౌరవం నాకు దక్కింది. ప్రపంచం నలుమూలలకు విస్తరించిన కోట్లాది నా భారత దేశ మిత్రులారా, ఈరోజు నేను పరిచయం చేస్తున్నాను నా మిత్రుడు,  భారతదేశానికి నిజమైన స్నేహితుడు అత్యంత గొప్పదైన అమెరికా దేశపు అధ్యక్షుడు మిస్టర్ డోనాల్డ్ ట్రంప్. అని పీఎం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటే ముసిముసి నవ్వులు నవ్వుతూ పక్కన నిలిచి ఉండటం అమెరికా అధ్యక్షుడి వంతయింది.

ప్రధాని మోడీ మాట్లాడుతూ, హౌ డు యు డు ఫ్రెండ్స్ అని పలకరించి,  ఇది ఒక చారిత్రక ఘట్టం, కల్పనకే అందని విషయం. అలాగే టెక్సాస్ విషయానికి వస్తే ఇది చాలా ఉన్నతమైనది, విశాలమైనది. అదే ఈరోజు ఇక్కడ కూడా ప్రతిబింబిస్తోంది.

ఈ రోజు ఇన్ని వేల మంది ఇక్కడికి రావడం లెక్కకు అందని విషయం మాత్రమే కాదు ఇది ఒక కొత్త హిస్టరీని, కెమిస్ట్రీని సృష్టిస్తోంది.

ఎన్ ఆర్ జి స్టేడియం ని ఉద్దేశించి….

ఎన్ ఆర్ జి లో ఉన్న ఈ ఎనర్జీ భారత అమెరికాల మధ్య ఉన్న సంబంధం పెరగడానికి ఈ సమాహారము ఆధారం అవుతోంది.

ఈ శుభ సందర్భంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇక్కడికి రావడం, వారితోపాటు వచ్చినటువంటి అనేకమంది సెనేటర్లు, ఇతర ప్రతినిధులు వారు రిపబ్లికన్లు కావచ్చు, డెమోక్రాట్లు కావచ్చు అందరూ ఇక్కడకు వచ్చి భారతదేశం గురించి ప్రశంసించడం నాకు, భారత దేశానికి శుభాకాంక్షలు చెప్పడం, ఇతర పెద్దలు సెనేటర్లు భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి చెప్పడము  ప్రశంసించడం, ఇది అమెరికాలోనూ నివసిస్తున్న భారతీయుల సామర్థ్యానికి, సాధించిన విజయానికి దక్కిన గౌరవం. అంతే కాదు ఇది 130 కోట్ల మంది భారతీయులకి దక్కిన గౌరవం.

నేను 130 కోట్ల మంది భారతీయుల సేవకుడను…..

మిత్రులారా ఈ కార్యక్రమం పేరు హౌడీ మోడీ.కానీ మోడీ ఒక్కడే అనేది ఏమీ లేదు. మోడీ అంటే 130 కోట్ల మంది భారతీయుల ఆదేశానుసారము పనిచేసే ఒక సాధారణ వ్యక్తి. అందుకే ఈ సందర్భంగా మీరు అడుగుతున్నారు ‘హౌడీ మోడీ’ అని. దానికి సమాధానము ఇక్కడే ఉన్నది భారత్ మే సబ్ అచ్చా హై, సబ్  జంగా సి, బదాద్ మజామా తే, అంతా బాగుంది, యల్లా  చెన్నాగిరే, ఎల్లమ్ సౌఖ్యం, సర్వచ్చాం చెల్లాయి, సబ్ కూబ్ భాలో, సబూ బల్లాచీ అని 9 భాషల్లో మాట్లాడి, అమెరికాలోని ఇక్కడి మిత్రులకి ఇది ఆశ్చర్యం వేస్తుంది, అరే మోడి  ఏం చెప్తున్నారు అని. ప్రెసిడెంట్  ట్రంప్ మరియు ఇతర మిత్రులారా నేను ఇది మాత్రమే చెప్పాను Every thing is fine అని. ప్రవాస భారతీయులనే కాకుండా అగ్రరాజ్యాధినేత మొదలుకుని యావత్ అమెరికా దేశాన్ని, ప్రపంచాన్ని సైతం తన వాక్చాతుర్యంతో ఉర్రూతలూగించారు ప్రధాని మోడి.

వైవిధ్యంలో ఏకత్వం మా బలం…..

భారతదేశంలోని విభిన్న భాషల గురించి చెబుతూ కేవలము భాష మాత్రమే కాదు విభిన్న సంప్రదాయాలు విభిన్న పూజ పద్దతులు విభిన్న ఆహార వ్యవహారాలు విభిన్న వేష భూషణాలు వాతావరణ అనుకూలంగా ఏర్పడినటువంటి విభిన్న ఋతువులు భారత భూమిని అద్భుతం చేశాయి. ఇలా వైవిధ్యంలో ఏకత్వం మా యొక్క గొప్పతనము, మా యొక్క విశేషాలు. ఇదే మా యొక్క అతి గొప్ప ప్రజాస్వామ్యానికి ఆధారం.  ఇదే మా యొక్క శక్తి , ఇదే మాకు ప్రేరణ. మేము ఎక్కడికి వెళ్ళినా  భిన్నత్వం, ప్రజాస్వామ్యము ఈ రెంటిని కలుసుకుని మాతో పాటు తీసుకెళ్తాం.

ఇంతకీ ఈ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మొన్న 2019లో జరిగిన ప్రజాస్వామ్య ఉత్సవంలో, ఎన్నికలలో ఇక్కడ ఉన్నటువంటి అనేకమంది మీయొక్క సహకారాన్ని అందించారు. ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో భారతదేశంలో61 కోట్ల మంది తమ యొక్క ఓటుహక్కును వినియోగించుకున్నారు. దానిలో 8 కోట్ల మంది కొత్తగా ఓటు వేసిన వారు, అలాగే ఈసారి అత్యధిక సంఖ్యలో మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధిక సంఖ్యలో తమ యొక్క సీట్లను కూడా గెలుచుకున్నారు. అలాగే ఈసారి మరో రికార్డు కూడా 2019 ఎన్నికలలో నమోదయింది. అదేమిటంటే ఒక ఐదేళ్ళు పాలించిన రాజకీయ పక్షం మరళా రెండవ పర్యాయం ముందు కంటే ఎక్కువ మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వం  60 సంవత్సరాలలో, గడచిన ఆరు దశాబ్దాలలో ఏదైనా ఉంది అంటే అది మా ప్రభుత్వమే. ఇది ఎలా జరిగింది? ఇది ఎందువల్ల జరిగింది? అంటే ఇది మోడీ వల్ల కాదు. కోట్లాది హిందుస్థానీల వల్ల జరిగింది.

నవ్య భారత నిర్మాణమే మా లక్ష్యం…..

మిత్రులారా ఈ సారి భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్తాము. అభివృద్ధి అత్యున్నత స్థాయిలో సాధిస్తాం. ఈరోజు భారతదేశంలో మంత్రము “సబ్ కా సాథ్ సబ్ కా వికాస్.” ఈరోజు భారతదేశంలో గొప్ప విషయము చెప్పుకోదగినది ప్రజల యొక్క భాగస్వామ్యం.

ఈరోజు భారతదేశంలో నడుస్తున్న నినాదము “సంకల్పం నుంచి సిద్ధి”. అలాగే ఈ రోజు భారతదేశం యొక్క సంకల్పము ఏమిటంటే “న్యూ ఇండియా” (నవ్య భారతం). ఈరోజు భారత దేశము తన సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు పగలు, రాత్రి కృషి చేస్తోంది. ఇది మరొకరి ద్వారా కాదు, మా యొక్క స్వశక్తితో చేస్తున్నాము.

“We are challenging ourselves, we are changing ourselves.”

మిత్రులారా ఈరోజు భారతదేశము మొదటిసారి కంటే కూడా అత్యంత వేగంగా ముందుకు వెళుతోంది. ఈరోజు భారతదేశంలో కొంతమంది మా ఆలోచనల్ని ఛాలెంజ్ చేస్తున్నారు, వారి ఆలోచనలు అసలు మారడం లేదు. గత ఐదు సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి కలలో కూడా ఊహించలేదు.

“We are aiming high, we are achieving higher”

ఎన్నో సాధించాం. ఇంకా సాధిస్తాం….

మిత్రులారా, 70 సంవత్సరాలో కేవలం 38% “గ్రామీణ పారిశుధ్యం” మాత్రమే పూర్తయింది. కానీ గత 5సంవత్సరాలలో మేము 11కోట్ల శౌచాలయాలు నిర్మించడం జరిగింది.  ఈరోజు “గ్రామీణ పారిశుధ్యం” భారతదేశంలో 99% పూర్తయింది.

ఇంతకు ముందు భారత దేశంలో వంటగ్యాస్ కనెక్షన్లు 55 శాతం ఉండేది. ఐదు సంవత్సరాల తర్వాత దీనిని 95 శాతానికి తీసుకొచ్చాం.

గడిచిన ఐదు సంవత్సరాలలో భారతదేశంలో 15 కోట్ల మందికిపైగా కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు భారతదేశంలో గత ఐదు సంవత్సరాలకు ముందు రూరల్ రోడ్ కనెక్టివిటీ 55 శాతం ఉండేది అది ఇప్పుడు 97 శాతానికి పూర్తయినది. కేవలం ఐదు సంవత్సరాలలో రెండు లక్షల కిలోమీటర్లు రోడ్ల నిర్మాణం పూర్తి చేసి గ్రామాలకి రోడ్ కనెక్టివిటీ ఇవ్వటం జరిగినది.

అలాగే ఇంతకు ముందు కేవలం 50 శాతం మందికి మాత్రమే బ్యాంక్ అకౌంట్లు ఉండేవి ఇప్పుడు నూటికి నూరు శాతం అన్ని కుటుంబాలు బ్యాంక్ ఎకౌంటుకి లింక్ అయి ఉన్నవి. అంటే 37 కోట్ల మందికి పైగా కొత్తగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది.

మిత్రులారా ఈరోజు భారతదేశంలో మౌలిక అవసరాల గురించి ఆలోచన చేయడం తగ్గింది. వారు వారి యొక్క కలలను సాకారం చేసుకోవడం కోసం మాత్రమే ప్రస్తుతం ఆలోచన చేస్తున్నారు. వారియొక్క శక్తినంతా వారిక లక్ష్యం వైపు  కేంద్రీకరిస్తున్నారు. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ అఫ్ లివింగ్ గురించి వారు ఆలోచన చేస్తున్నారు. సాధికారత సాధిస్తున్నారు.

దేశంలోనే సామాన్య వ్యక్తి శక్తిమంతం అవుతున్నాడు. దేశం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. నేను మీకు ఈ రోజు ఒక ఉదాహరణ చెప్తాను. ఈరోజు మీరు ఎక్కడికైనా వెళ్ళండి మీకు కావలసినది డేటా. అటువంటి డేటా ఈ రోజు ప్రపంచలో అత్యంత తక్కువ ధరకు దొరికేటువంటి దేశం భారత దేశం. ఈరోజు 1Gb data 25 to 30 cents కి మాత్రమే అంటే 1డాలర్ లో 14వ శాతం. ఇంత తక్కువ ధరతో భారతదేశంలో డిజిటల్ ఇండియా రూపంలో ఈ గవర్నెన్స్ అనేది నడుస్తోంది. ఈరోజు భారతదేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సుమారుగా పదివేల సర్వీసులు ఆన్లైన్లో లభ్యమవుతున్నాయి.

మిత్రులారా ఇంతకుముందు పాస్పోర్ట్ రావాలంటే రెండు నుంచి మూడు నెలలు సమయం పట్టేది. ఈ రోజున పదిహేను రోజులలో పాస్పోర్ట్ ఇంటికి వచ్చేస్తోంది.

మిత్రులారా ఇంతకుముందు ఒక కంపెనీ పెట్టాలంటే దానికి వారం రోజుల నుంచి 15 రోజులు పట్టేది. ఇప్పుడు కేవలం 24 గంటల్లో ఒక కొత్త  కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతోంది.

ఒకానొక సమయంలో టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం చాలా కష్టంగా ఉండేది. వాటిని ఫైల్ చేయడానికి నెలల తరబడి సమయం వెచ్చించాల్సి వచ్చేది. కానీ వినండి ఈ సారి ఆగస్టు 31 ఒక్కరోజులో…. ఒకే ఒక్క రోజులో 5 లక్షల మంది తమ యొక్క ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ని ఆన్లైన్ లో చేర్చారు. అంటే ఈరోజు ఇక్కడ ఈ హోస్టన్ జనాభా కంటే కూడా రెండింతల మంది ఫైల్ చేశారు. అలాగే ఇంతకుముందు టాక్స్ రిఫండ్ కూడా నెలల తరబడి చూడాల్సి వచ్చేది కానీ ఇప్పుడు వారం, పది రోజుల్లో తిరిగి మరలా మన బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేస్తున్నాయి.

మేము వెల్ఫేర్ చేశాం. ఫేర్ వెల్ కూడా చేశాం….

మిత్రులారా ఏ దేశంలో అయినా సరే అభివృద్ధిని సాధించడానికి వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి సహజంగా అవసరమవుతాయి. భారతదేశంలో వెల్ఫేర్ స్కీమ్స్ తో పాటుగా నవ్య భారతాన్ని, న్యూ ఇండియాని సృష్టించడానికి, రూపొందించడానికి కొన్నిటికి ఫేర్వెల్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

మేము ఎంత వెల్ఫేర్ ని చేశామో,  అంత ఫేర్వెల్ కూడా ఇచ్చాము. ఈ సంవత్సరము అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ యొక్క 150వ జయంతి సందర్భంగా బహిరంగ విసర్జనకి ఫేర్వెల్ ఇచ్చేస్తున్నాం. గడిచిన ఐదు సంవత్సరాలలో భారతదేశంలో పురాతనమైన పదిహేను విషయాలకి ఫేర్వల్ ఇచ్చేశాము. మా ప్రభుత్వం టాక్స్ కట్టని వారికి ఫేర్వెల్ ఇచ్చేసింది. అలాగే జీఎస్టీ తీసుకొచ్చాం. వన్ నేషన్ వన్ టాక్స్ అనేది సాకారం చేసుకునే దిశగా అడుగులు వేశాం. అలాగే మా ప్రభుత్వం అవినీతిని నిరోధించడానికి అడుగులు వేస్తోంది. ప్రతి యొక్క స్థాయిలో దాని కోసం కృషి చేస్తున్నది.

అలాగే గడిచిన రెండు మూడు సంవత్సరాలలో మూడున్నర లక్షల బోగస్ కంపెనీలకి ఫేర్వెల్ ఇచ్చేశాం. అలాగే 8 కోట్ల తప్పుడు పేర్లతో ఉండే కంపెనీలకు కూడా ఫేర్వెల్ ఇచ్చేశాం. వీటి ద్వారా సుమారుగా 20 వేల బిలియన్ డాలర్ల ప్రజాధనాన్ని రక్షించాము. అలాగే రాబోయే కాలంలో అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్క భారతీయుడికి నేరుగా చేరే విధంగా పారదర్శకతను ప్రవేశ పెడుతున్నాము.

అలాగే వీటితోపాటుగా 70 సంవత్సరాలకు ముందు నుంచి ఉన్నమరొక విషయాన్ని కూడా మేము ఫేర్వెల్ చేశాము. అదేమిటో మీ అందరికీ కూడా తెలుసు. గత కొద్ది రోజుల ముందరే అది మీ అందరికీ అర్థమైంది కదా, ఆ విషయమే ఆర్టికల్ 370.

ఆర్టికల్ 370 పేరుతో గత 70 సంవత్సరాలుగా జమ్మూకాశ్మీర్ మరియు లడాఖ్ ప్రాంతాలని అభివృద్ధికి దూరంగా ఉంచారు. అక్కడ ఉగ్రవాదాన్ని ప్రేరేపించారు. కానీ ఈరోజు భారత రాజ్యాంగం ద్వారా భారతదేశంలోని మిగతా రాష్ట్రాల ప్రజలందరికీ ఉండే హక్కులన్నీ జమ్మూ-కాశ్మీర్ మరియు లడాఖ్ ప్రజలకి కూడా దక్కాయి. అలాగే ఈ రోజున అక్కడ నివసించే మహిళల పట్ల,  పిల్లల పట్ల,  దళితుల పట్ల ఉన్న భేద భావాలు  అన్ని కూడా సమసి పోనున్నాయి.

మిత్రులారా దీని గురించి భారతదేశంలో భారత పార్లమెంట్ లో ఎగువ మరియు దిగువ సభలలో గంటల తరబడి చర్చ జరిగింది. ఇది ప్రపంచం మొత్తం కూడా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూసింది. మిత్రులారా రాజ్యసభలో బలం లేకపోయినప్పటికీ బిల్లును ప్రవేశపెట్టి ఎగువ మరియు దిగువ సభలు రెండింటిలోనూ అత్యధిక శాతం ఓట్లతో విజయం సాంధించాము.

దీన్ని నచ్చనివాళ్ళు ఎవరైతే అశాంతిని కోరుకుంటున్నారో? ఎవరైతే ఉగ్రవాదాన్ని సమర్ధిస్తున్నారో? ఎవరైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారో? వారు మాత్రమే. వారి గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు.

అమెరికాలో నవంబర్ 11 కావచ్చు భారత్లో ముంబైలోని నవంబర్ 26 కావచ్చు ఈ రెండు విషయాలకి మూలం ఎవరో అందరికీ తెలుసు. మిత్రులారా ఉగ్రవాదులకి, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే వారికి వ్యతిరేకంగా అందరమూ నిల్చుని పోరాడాలి.

ఈ విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్ మాకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థించేవారికి వ్యతిరేకంగా. కాబట్టి ఒక్కసారి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న టువంటి ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క మనో బలానికి మనందరం కూడా ఒకసారి నిల్చుని హర్షధ్వానాలని ప్రకటిద్దాం.

మిత్రులారా భారత్ లో చాలా జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. మనందరం కూడా ఒక కొత్త చాలెంజ్ తీసుకోవడానికి ముందుకు రావాలి

మిత్రులారా ఈరోజు భారతదేశము అయిదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఎదుగుతోంది. మౌళిక పెట్టుబడులు, అలాగే ఎగుమతులు పెంచటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క మౌలిక వసతుల కల్పనకే 1.3 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టటానికి సిద్ధంగా ఉన్నాం.

మిత్రులారా గడిచిన నుండి కొద్ది నెలల్లో ప్రపంచం మొత్తం ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ భారతదేశం యొక్క ఆర్ధిక వృద్ధి రేటు సరాసరి 7.5 గా ఉన్నది. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఒకసారి చూడండి. ఎప్పుడు కూడా ఇంతటి అభివృద్ధిని మనం సాధించలేదు.

అత్యల్ప ద్రవ్యోల్బణం, అత్యల్ప ద్రవ్యలోటు, అధిక వృద్ధి రేటు సాధించటం మా లక్ష్యం. 2014 నుంచి 2019 వరకు  ఎఫ్ డీ ఐ లు ఎలా ఉన్నాయో, వాటి యొక్క పరిధిని రెండు శాతం పెంచుకుంటూ వచ్చాము. ఒకే ఒక బాండ్ ద్వారా ఎఫ్ డీ ఐ ని సులభతరం చేశాము.

కాబట్టి మిత్రులారా రాబోయే కాలంలో భారత దేశము 5 ట్రిలియన్ డాలర్లు ఎకానమీ సాధిస్తుందని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని, దానికి ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క పూర్తి సహకారం లభిస్తుంది. రాబోయే రెండు మూడు రోజుల్లో వారితో అనేక సందర్భాల్లో చర్చల్లో పాల్గొంటున్నా. సాధారణంగా ప్రెసిడెంట్, మోడీ “గట్టి సంధానకర్త” అంటారు. కానీ నేను అంటున్నాను ప్రెసిడెంట్ ట్రంప్ వ్యవహారాలను చక్కబెట్టడంలో సిద్ధహస్తుడు.  నేను వారి నుంచి చాలా నేర్చుకోవాలి.

మీరు దూరంగా ఉన్నా మేము దూరం కాము…

మిత్రులారా ఒక బృహత్తరమైన భవిష్యత్తు కోసం మేము ముందుకేగుతున్నాం. మేము మరింత వేగంగా ముందుకు వెళ్లవలసి ఉంది. ఈ విషయంలో మీరే మా చోదక శక్తి.  మీరు మన దేశానికి దూరంగా ఉండవచ్చు. కానీ మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీకు ఎప్పుడూ దూరంగా ఉండదు.

విదేశాలలో నివసించే ప్రవాస భారతీయులకి వారి యొక్క రక్షణకి ఎల్లప్పుడూ భారత ప్రభుత్వం అండగానే ఉంటుంది.

ఇరు దేశాల్లో కూడా సమానమైన భావన కలిగి సమానమైన ఆలోచనల్ని పంచుకుంటూ సరికొత్త అభివృద్ధిని సాధించాలి. నేను అమెరికా అధ్యక్షుడ్ని కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తున్నాను. ఖచ్చితంగా మీరు కుటుంబ సమేతంగా భారతదేశం రండి. మన మధ్య ఉన్నటువంటి స్నేహం, పంచుకున్నఆలోచనలు, ఉజ్జ్వలమైన భవిష్యత్తు దిశగా అడుగులు వేస్తూ మరింత ఎత్తుకు ఎదగాలి.

మోడీ ప్రసంగం తర్వాత ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్ తో స్టేడియంలో ప్రజల మధ్యలోకి వెళ్లటం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క విజయోత్సవ ర్యాలీని తలపించింది.

సేకరణ : అనంత విజయం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.