
గుర్రం జాషువా, బోయి భీమన్నలు అభ్యుదయ సాహిత్యానికి రెండు కళ్ళని కృష్ణాజిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు అన్నారు. మచిలీపట్నంలోని బుట్టాయి పేట వివేకానంద మందిరంలో సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో జాషువా, భీమన్నల జయంతి వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ భీమారావు జాషువా, భీమన్నలు ప్రజలను చైతన్య పరచేందుకు అనేక రచనలు చేసి తమదైన ప్రత్యేకతను చాటుకున్నారని, సాహితీ ప్రపంచానికి వారు అందించిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. వారు కలంతోనే సామాజిక రుగ్మతలను ప్రశ్నిస్తూ సమాజ చైతన్యానికి విశేష కృషి చేశారని కొనియాడారు. వారి రచనలు నేటి విద్యార్థులు కూడా తెలుసుకునేలా తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సహించాలని సూచించారు. అలాంటి వారిని గుర్తు చేస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సామాజిక సమరసతా వేదిక నిర్వాహకులను ఆయన అభినందించారు.
తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీ అప్పినేడి పోతరాజు బోయి భీమన్న జీవిత చరిత్ర, రచనల గురించి సభికులకు వివరించారు. భీమన్న తన 11వ ఏటనే కవితలు వ్రాసి అందరి మన్ననలు అందుకున్నారని అన్నారు. ఆయన రాసిన ‘పాలేరు’ నాటకం అప్పట్లో ఎంతో గుర్తింపు పొందిందని తెలిపారు. ఆయన రచనలు, పద్యాలను ఆలపిస్తూ ఆయన చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. బోయి భీమన్న సంపూర్ణ జీవితాన్ని గడిపి తన తుది శ్వాస వరకు సాహితీ సేవలు అందించారని శ్రీ పోతరాజు చెప్పారు.
డీసీటీవో బండి నాగలక్ష్మి గుర్రం జాషువా రచనల ప్రత్యేకతను వివరించారు. ఆయన రచనల్లో గబ్బిలం సర్వోత్తమమైనదని తెలిపారు. గుడిలో దళితుడికి ప్రవేశం లేదు కానీ గబ్బిలానికి అడ్డు లేదని చెప్పిన తీరు హృదయాలను కలచివేస్తుంది అన్నారు. సామాజిక సమరసతా వేదిక అధ్యక్షుడు శ్రీ అంకాని శేషుబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి శ్రీ అంకం జితేంద్ర, న్యాయవాదుల సంఘ అధ్యక్షులు శ్రీ వడ్డి జితేంద్ర, పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.





