
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగర శివారులో దాదాపు 25 ఎకరాల విశాలమైన స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో శైవ, వైష్ణవ ఆలయ నిర్మాణం చేపట్టబోతున్నారు. స్థల సేకరణ పూర్తయి, ముందస్తు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
టెక్సాస్ లో ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా హరిహర క్షేత్రం..
హరిహర క్షేత్ర ఆలయాన్ని ఇతర ఆలయాల కన్నా భిన్నంగా ఉండేలా నిర్మించనున్నారు. టెక్సాస్‌లోని హిందూ సమాజానికి ఆధ్యాత్మికంగా, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. సమీప భవిష్యత్తులో సనాతన భారతీయ సంప్రదాయంతో పాటు కమ్యూనిటీపరంగా ఆధ్యాత్మికను ప్రతిబింబించే వేదికను సృష్టించడమే తమ లక్ష్యమని ఆలయ కమిటీ చైర్మన్, కేబీకే గ్రూప్ ఛైర్మన్, సీఈఓ డా. కక్కిరేణి భరత్ కుమార్ తెలిపారు.
తాత్కలికంగా బాలాలయం..
ప్రస్తుతం ఈ 375 కింగ్ రియా జార్జ్ ప్రదేశంలో తాత్కాలికంగా ఒక బాలాలయాన్ని నెలకొల్పారు. ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇటీవలే బాలాలయం ప్రారంభోత్సవం భారీ వేడుకగా జరిగింది. ఆలయ చైర్మన్ భరత్ కుమార్ మార్గనిర్దేశంలో అక్టోబరు 20న హరిహర క్షేత్రం బాలాలయం ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ ఆలయ ప్రారోంభోత్సవానికి స్థానికంగా ఆస్టిన్ నగరంలోని హిందూ కుటుంబాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి బాలాలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. వేద మంత్రోచ్ఛరణలు, ధూపద్రవ్యాలు, సాంప్రదాయ దుస్తులతో ఆ ప్రాంతం అంతా సాంస్కృతిక, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ప్రారంభోత్సవంలో భాగంగా వేద మంత్రోచ్ఛరణలతో మహా కుంభాభిషేకం అనంతరం పూజలు, అర్చనలు నిర్వహించారు.





