
భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మేధావులు ఎంతోమంది వ్యతిరేకించినప్పటికీ అప్పటి ప్రధాని నెహ్రూ తీసుకొన్న అనాలోచిత నిర్ణయంతో జమ్మూకాశ్మీర్ రాష్ట్రం 70 సంవత్సరాల పాటు రాజ్యాంగ ఫలాలకు దూరమగుటయేకాక, జాతి వ్యతిరేక శక్తుల స్థావరంగా మారిందని RSS ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ అన్నారు.
సమాలోచన కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని స్వాతి కళ్యాణమండపంలో 370 ఆర్టికల్ రద్దుపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, కేవలము మూడు కుటుంబాల స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్ని రోజులు ఆర్టికల్ 370 కొనసాగిందని చెప్పారు. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాగం ఉండాలని జాతి యావత్తు కొరిన కోరిక నేడు సాకారమైందని వారు చెప్పారు.

ఆర్టికల్ 370 కారణముగా జమ్మూకాశ్మీర్లో అనేక కేంద్రప్రభుత్వ పథకాలను అక్కడి ప్రజలు పొందలేక పోయారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని అన్నారు.
ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్న కొన్ని పక్షాలు వ్యక్తులపై ద్వేషముతో దేశానికి మేలుచేసే విషయాలలో అనాలోచితముగా వ్యవహరించడం చూస్తేంటే బాధ కల్గుతోందన్నారు.
జమ్మూకాశ్మీర్ కి చెందిన యువతి వేరే రాష్ట్రానికి చెందిన ఒక భారత పౌరుణ్ణి పెళ్లి చేసుకొంటే తన జమ్మూకాశ్మీర్ పౌరసత్వం కోల్పోవడం, అదే యువతీ ఒక పాకిస్థాన్ పౌరుణ్ణి పెళ్లి చేసుకొంటే ఆ పాకిస్థాన్ పౌరుడికి కూడా జమ్ముకాశ్మీర్ పౌరసత్వం రావడం లాంటి వింత నిబంధనలు చూస్తే ఈ ఆర్టికల్ ఎవరి ప్రయోజనం కోసం రూపొందించబడినదో అర్థమవుతుందని వారు పేర్కొన్నారు. భారత పార్లమెంట్ ఆమోదించిన ఏ చట్టమైనా దేశమంతటా అమలవుతుంటే జమ్మూకాశ్మీర్లో మాత్రం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదిస్తే తప్పితే అమలయ్యే పరిస్థితి లేకపోడం ఈ ఆర్టికల్ పుణ్యమేనని వారు అన్నారు.
భారత్లోని ఏ ఇతరరాష్ట్రం వారికి కూడా ఆ రాష్ట్రంలో ఆస్తులు కొనే హక్కు లేకపోవడంతో అభివృద్ధి దూరమై యువత పెడ మార్గం పట్టారని నేడు అభివృద్ధి ఫలాలు జమ్మూకాశ్మీర్ కి అందించే తరుణం అసన్నమైనదన్నారు. నేడు 370 ఆర్టికల్ రద్దుతో జమ్మూకాశ్మీర్ భారత్లో అంతర్భాగం అనే దేశప్రజల ఆకాంక్ష నెరవేరిందని చెప్పారు.

నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకొంటున్న సాహసోపేత నిర్ణయాల ఫలితంగా నేడు ప్రపంచదేశాలలో భారత్ ఒక విశిష్ట గుర్తింపును పొందడం హర్షించదగ్గ పరిణామమని వారు చెప్పారు.
నగరంలోని విద్యావంతులు, వివిధ సంస్థల ప్రతినిధులు, వివిధ రాజకీయపక్షాల నాయకులు హాజరైన ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డా .గుండారపు రాఘవరావు, ‘భారతీయం’ సాంసృతిక సంస్థ అధ్యక్షులు ఈదర భరత్ ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు.





