
పార్వతీపురం మన్యంజిల్లా భామిని మండలం తువ్వకొండల్లోని అక్షరబ్రహ్మకు దీక్ష సమర్పణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం నూకాలమ్మ గూడ అక్షరబ్రహ్మ సంఘం సమన్వయకర్త సవర కరువయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక్కడి గిరిజన ప్రజలు ఆచార సంప్రదాయం ప్రకారం కార్తికమాసంలో 21 రోజుల దీక్షను ఆచరిస్తారు. ఆఖరి రోజు ఏకరూప దుస్తులు ధరించి తులసి పూజతో దీక్షను విరమిస్తారు. ఆ సమయంలో సవర భాష లిపి సృష్టికర్త సవర మంగైదొర చిత్రపటానికి ప్రతులు సమర్పిస్తారు. అనంతరం గిరిజన కళలు, సంస్కృతిని తెలియజేస్తూ వివిధ రకాల నృత్యాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూఢనమ్మకాలపై విశ్వాసం, జంతు బలిని ప్రోత్సహించబోమన్నారు. సభ్యులంతా అక్షరాన్నే పూజిస్తారన్నారు. కార్యక్రమంలో అక్షరబ్రహ్మ ఒడిశా గురువు రాంప్రసాద్ గమాంగ్, డైరెక్టర్ కె.కామేశ్వరరావు, గంగారావు, అడ్డాయి, గునసాబు, గిరిజన మహిళలు పాల్గొన్నారు.





