
మరుగున పడిన చరిత్రను మళ్లీ పునరుద్దరించేందుకు యువత నడుమ కట్టి ముందుకు రావడం ఎంతో ఆనందం గా ఉందని మాజీ ప్రభుత్వ విప్… శ్రీకాకుళం జిల్లా అమదాలవలస సీనియర్ శాసనసభ్యులు కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం వేదికగా బాలియాత్ర పురాతన జాతరకు శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు బాలి యాత్ర కార్తీక పౌర్ణమినాడు శ్రీ ముఖలింగం లో నిర్వహించే వారని.. ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఈ రోజు కార్తీక దీపారాధన చేసి.. చరిత్ర పుటల్లో కనుమరుగు అవుతున్న బాలియాత్ర పునరుద్దరణ చేశామని ఎమ్మెల్యే అన్నారు. ఎంతో చారిత్రిక నేపథ్యం కలిగిన బాలియాత్ర కళింగ దేశంలో ప్రజలకు సిరు సంపదలు తెచ్చే జాతరగా పేరు గాంచింది అని అన్నారు.
ఒడిస్సాలో మహా నది నుండి ఇటు గోదావరి వరకు ఉన్న ప్రాంతాన్ని కళింగ సీమ అంటారని ఆనాడు అంతర్జాతీయ స్థాయిలో నౌకా వ్యాపారం జరిగేదని అన్నారు. కనుమరగవుతున్న మన సాంప్రదాయాలు భావితరాలకు తెలియజేసేందుకు ఈ బాలి యాత్ర నిర్వహించడం ఎంతో ముదావహం అని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి డాక్టర్ శీదిరి అప్పలరాజులు అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ.. ఉత్తరాంధ్ర జిల్లాల కు చెందిన పలువురు ప్రముఖులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు… అంతకన్నా ముందు మంగళ వాయిద్యాల నడుమ వంశధార నది వరకు ఊరేగింపుగా వెళ్లి అక్కడ స్నానాలు చేసి హారతి ఇచ్చారు.





