
భారత సైన్యం అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది డీఆర్డీఓ. శనివారం ఒడిశాలోని అబ్దుల్‌కలాం ద్వీపం నుంచి డీఆర్డీఓ క్షిపణి పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షతో దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణులున్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది. 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదని అధికారులు తెలిపారు.
వివిధ రకాల వార్‌హెడ్‌లను అమర్చేలా క్షిపణిని డిజైన్ చేశామని వెల్లడించారు. ఇక ఈ పరీక్ష సైనిక దళాలకు చెందిన కీలక అధికారులు, శాస్త్రవేత్తల సమక్షంలో జరిగింది. క్షిపణి గమనాన్ని వివిధ వేదికల నుంచి జాగ్రత్తగా ట్రాక్ చేసినట్లు, చివరి దశలో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఢీకొన్నట్లు డీఆర్‌డీవో వెల్లడించింది. హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మిసైల్ కాంప్లెక్స్‌లో క్షిపణిని రూపొందించిగా, దేశంలోని ఇతర డీఆర్డీఓ ల్యాబ్‌లు, పరిశ్రమలు సహకరించాయి.
దీర్ఘశ్రేణి హైపర్‌సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం వల్ల భారత్ ఓ పెద్ద మైలురాయిని దాటిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ చారిత్రక ఘట్టంతో అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీని సాధించిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరిందని పేర్కొన్నారు.





