News

గోధ్రా ఘటనపై వాస్తవాలు వెలుగులోకి..: మోదీ

296views

అసత్య ప్రచారాలు కొంతకాలమే చలామణి అవుతాయని, కానీ ఎప్పటికైనా వాస్తవాలు వెలుగుచూడటం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గోధ్రా రైలు దహనం ఘటనకు సంబంధించిన వాస్తవాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ‘సబర్మతి రిపోర్ట్‌’ చిత్రం వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. 2002లో మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో జరిగిన అల్లర్లు, గోధ్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు దహన కాండను ఆధారంగా చేసుకుని ‘సబర్మతి రిపోర్ట్‌’ తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఓ నెటిజన్‌ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ‘‘దేశ చరిత్రలోని హేయమైన ఘటనకు సంబంధించిన వాస్తవాలను ఈ చిత్రం కళ్లకు కట్టింది. రైలు ప్రయాణికులను దహనం చేసిన ఘటనను కొందరు వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించారు. ఓ నాయకుడి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారు’’ అని ఆ వ్యక్తి పేర్కొనగా, దీనిపై మోదీ పై విధంగా స్పందించారు.