
నేటి బాల్యం ఫోన్లలో బిజీగా గడుపుతున్న నేపథ్యంలో పుస్తక పఠనం కరువవుతోంది. కానీ ఆ బాలుడుకి వేదమే ప్రాణం. చిన్ననాటి నుంచి ఆగమ పండితుడిగా రాణించాలన్న లక్ష్యం పెట్టుకున్నాడు తిరుపతికి చెందిన టి.బ్రహ్మాచార్యులు, సంతోషి దంపతుల కుమారుడు తూమాటి వేంకటనరసింహకృష్ణ దీక్షితులు. వేదం వంట బట్టాలంటే కనీసం 12 ఏళ్ల కఠోర శ్రమతో సంహిత, అరణ్యకం, బ్రాహ్మణం, ఉపనిషత్ పూర్తి స్థాయిలో సాధన చేయాలి. అయితే ప్రస్తుతం వేంకటనరసింహకృష్ణ దీక్షితులు 11 ఏళ్లకే అరణ్యకం పూర్తి చేశాడు. పండితులను తలపించేలా ఇందులోని శ్లోకాలు అనర్గళంగా పలికే స్థాయికి ఎదిగాడు. శ్రీకాళహస్తిలోని జనార్థనానంద సరస్వతీ స్వామి ట్రస్టు నిర్వహించిన వేద పరీక్షల్లో అరణ్యకం భాగంలో ప్రథమ స్థానంలో నిలచి, సత్తా చాటాడు. ప్రస్తుతం 11 ఏళ్ల ఆ బాలుడు పాఠశాల స్థాయిలో ఎన్నో వేద కార్యక్రమాల్లో పాల్గొని, పండితుల ప్రశంసలు అందుకున్నారు. స్కూల్ స్థాయిలో వేదం తప్ప వేరే ధ్యాస లేని ఆ బాలుడు భవిష్యత్త్‌లో గొప్ప ఆగమపండితుడిగా రాణించాలనే అతని లక్ష్యానికి తల్లిదండ్రులు తమవంతు సహకారం అందిస్తున్నారు.





