News

వారణాసి, అయోధ్యలతో పాటు దేశవ్యాప్తంగా భక్తుల పుణ్యస్నానాలు

238views

దేశవ్యాప్తంగా నవంబర్‌ 15 కార్తీక పౌర్ణమి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ పరిత్ర పుణ్యదినాన ఉత్తరాదినగల గంగా ఘాట్‌లలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. వారణాసి, అయోధ్యలతో పాటు ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర నదుల వద్ద భక్తుల రద్దీ నెలకొంది.

యూపీలోని అయోధ్యలోని సరయూ స్నాన ఘట్టాల వద్ద భక్తులు పూజలు, పుణ్యస్నానాల కోసం బారులు తీరారు. కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలకు 10 లక్షల మందికి పైగా భక్తులు అయోధ్యకు వచ్చే అవకాశం ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇదేవిధంగా యూపీలోని వారణాసిలోనూ పుణ్యస్నానాల కోసం గంగా ఘాట్‌ల వద్ద భక్తులు బారులు తీరారు. ఈ రోజున వారణాసిలో దేవ్‌ దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. వీటిని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వారణాసికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా రెండు రోజుల పాటు విశ్వనాథుని స్పర్శ దర్శనాన్ని అధికారులు నిలిపివేశారు.

కాగా సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రజలకు కార్తీక పూర్ణిమ, గురునానక్ దేవ్‌ల జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు దక్కాలని ఆకాంక్షించారు. గురునానక్ తత్వవేత్త, సంఘ సంస్కర్త, కవి, యోగి, దేశభక్తుడని ఆయన కొనియాడారు. సమాజంలోని మూఢనమ్మకాలు, కులతత్వాన్ని తొలగించేందుకు గురునానక్‌ కృషి చేశారని ఆయన అన్నారు.