
బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదం తొలగించాలని అటార్నీ జనరల్ ఎండీ అసదుజ్జమాన్ ఆ దేశ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దేశంలో 90శాతం మంది ప్రజలు ఒకే మతానికి చెందినవారు కావడంతో ఇది అవసరం లేదని అభిప్రాయం వ్యక్తంచేశారు. రాజ్యాంగంలోని 15వ సవరణపై ఆ దేశ సుప్రీంకోర్టులో జస్టిస్ ఫర్హా మహబూబ్, దేబ్‌శీష్ రాయ్‌చౌధరీ బెంచ్ ఎదుట ఆయన వాదనలు వినిపించారు.
‘‘గతంలో రాజ్యాంగం భగవంతుడిపై విశ్వాసం ఉంచేది. అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఆర్టికల్ 2ఏ అన్ని మతాలకు సమాన హక్కుల గురించి చెబుతుంది. ఆర్టికల్ 9 బెంగాలీ జాతీయత గురించి మాట్లాడుతుంది. ఇది పరస్పర విరుద్ధం. రాజ్యంగ సవరణలు ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించాలి.. అంతేకానీ, నియంతృత్వాన్ని కాదు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయకుండా ఉన్న ఆర్టికల్ 7ఎ, 7బి అభ్యంతరకరం. ఇవి సంస్కరణలను అడ్డుకోవడంతోపాటు.. రాజకీయ శక్తి ఏకీకరణకు దారితీస్తోంది’’ అని వాదించారు.
అంతేకాదు.. బంగ్లాదేశ్ విమోచన యోధుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ను జాతిపితగా పిలవడం దేశాన్ని విభజిస్తోందని ఎండీ అసదుజ్జమాన్ ఆరోపించారు. ఇది వాక్ స్వేచ్ఛను హరిస్తోందన్నారు. ఆయన సేవలు చాలా అమూల్యమైనవి అయినా.. ఆయన్ను గౌరవించాలని బలవతం చేయడంతో వ్యతిరేకత వస్తోందన్నారు. రాజ్యాంగంలో 15వ సవరణను రద్దు చేయాలని కోరారు.
మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను పూర్తిగా అణచివేయాలని అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆమెపై పలు కేసులు బనాయించింది. భారత్‌లో తలదాచుకుంటున్న ఆమెను స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్‌పోల్ సాయం కోరనున్నట్లు ఇటీవలే తెలిపింది. ఈ ఏడాది జులై-ఆగస్టు నెలల్లో విద్యార్థుల ఉద్యమాన్ని ఆమె నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం దారుణంగా అణచివేయడంతో 753 మంది విద్యార్థులు చనిపోయారని పేర్కొంది. వేలమంది గాయపడ్డారని వెల్లడించింది. తాజాగా ఆమె తండ్రి ముజిబుర్ రెహ్మాన్ కీర్తిని కూడా మెల్లగా తగ్గించేందుకు యత్నిస్తోంది.





