News

శంబర పోలమాంబ జాతర తేదీలు ఖరారు

245views

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి జాతర తేదీలను దేవదాయ శాఖ అధికారులు గ్రామపెద్దల సమక్షంలో ఖరారు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో కొలువైన శంబర పోలమాంబ అమ్మవారి జాతర తేదీలను చదురుగుడిలో ప్రకటించారు. డిసెంబర్‌ 23న పెద్దమ్మవారి సనప చాటింపు వేస్తారు. 30న పెద్దమ్మవారిని గ్రామంలోకి తెచ్చేందుకు ముహూర్తం ఖరారు చేశారు. 2025 జనవరి 6వ తేది పెద్దమ్మవారి తొలేళ్ల ఉత్సవం, 7న ప్రధాన ఉత్సవం, 8న అనుపోత్సవం నిర్వహించి, అదే రోజు శంబర పోలమాంబ అమ్మవారు (చిన్నమ్మ వారు) పండగ తెచ్చేందుకు చాటింపు వేస్తారు. జనవరి13న పోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి కొని తెచ్చేందుకు నిర్ణయించారు. జనవరి 14వ తేదీన అమ్మవారు గ్రామానికి చేరుకుని, చదురుగుడిలో విశ్రాంతి తీసుకుంటారు, అప్పటినుంచి 13 రోజులపాటు పోలమాంబ అమ్మవారు గ్రామంలో తిరువీధి చేస్తూ, భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. జనవరి 27న తొలేళ్ల ఉత్సవం, 28న సిరిమానోత్సవం, 29న అనుపోత్సవం నిర్వహించేందుకు దేవదాయ శాఖ అధికారులు, గ్రామ పెద్దలు, రెవిన్నాయుడు, ఆశాజీల సమక్షంలో నిర్ణయించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ సిబ్బంది, మాజీ ట్రస్ట్‌ బోర్డ్‌ చైర్మన్‌లు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.