
ఉక్కుగుండె, పరమ దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ని దాయాది పాకిస్తాన్ తీవ్రంగా అవమానపరిచింది. తన దురహంకారాన్ని ప్రదర్శిస్తూ అనరాని మాటలను కూడా అనేసింది. ఆయనో నేరస్థుడని, విప్లవకారుడు కాదని, ఆయనో నేరస్థుడంటూ పేర్కొంది. ఇదంతా ఆయన పేరుతో అక్కడ ఓ చౌక్ పెట్టాలన్న ప్రతిపాదనతో వచ్చింది. లాహోరులోని శాద్ మన్ చౌక్ కి భగత్ సింగ్ పేరు పెట్టాలని స్థానిక ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదించింది. అలాగే విగ్రహం కూడా ప్రతిష్ఠించాలని సంకల్పించింది. అయితే.. ఓ రిటైర్డ్ మిలటరీ అధికారి తారీఖ్ మజీద్ ప్రతిఘటించడంతో తాజాగా ఈ నిర్ణయాన్ని పాక్ రద్దు చేసుకుంది.
ఈ మేరకు అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఈ నిర్ణయాన్ని లాహర్ హైకోర్టుకు తెలియజేశారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా తెలియజేస్తూ… అందులో భారత స్వాతంత్రం కోసం పోరాడిన భగత్ సింగ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. భగత్ సింగ్ విప్లవకారుడు కాదని, ఆయన ఓ నేరస్థుడంటూ తారీఖ్ మజీద్ దురహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తూ తీవ్రంగా అవమానించాడు. నేటి పరిభాషలో చెప్పాలంటే ఆయనతో ఉగ్రవాది అని, అతను బ్రిటీష్ పోలీసు అధికారిని చంపాడని చెప్పుకొచ్చాడు.
ఈ నేరం చేయడం వల్లే ఇద్దరు సహచరులతో సహా భగత్ సింగ్ ని కూడా ఉరితీశారని చెప్పుకొచ్చాడు. ఈ కారణాలతోనే భగత్ సింగ్ పేరుతో చౌక్ ఏర్పాటు చేయవద్దని, అలాగే విగ్రహం కూడా పెట్టవద్దని సలహా ఇచ్చాడు.అంతేకాకుండా ముస్లింలను తీవ్రంగా వ్యతిరేకించే మత పెద్దల మాటలకు భగత్ సింగ్ తీవ్రంగా ప్రభావితుడయ్యాడని ఆ నివేదికలో తారీఖ్ మజీద్ పేర్కొన్నారు. భగత్ సింగ్ ఫౌండేషన్ ఇస్లామిక్ భావజాలానికి, పాకిస్తానీ సంస్కృతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, దానిని నిషేధించాలని కూడా సిఫార్సు చేశాడు. పాక్ లో ఓ నాస్తికుడి పేరుతో చౌక్ ఏర్పడం, నాస్తికుడి విగ్రహం పెట్టడం ఆమోదయోగ్యం కాదని, ఓ వ్యక్తి విగ్రహం పెట్టడం కూడా ఇస్లాంలో నిషేధమన్నారు. తమని తాము ముస్లింలమని ప్రకటించుకున్న ఫౌండేషన్ కి ఈ విషయమే తెలియదా? అంటూ ప్రశ్నించాడు.
భారత స్వాతంత్ర సంగ్రామంలో యువకుడు భగత్ సింగ్ ది కూడా కీలక పాత్రే. బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం చేస్తానని చిన్నతనం నుంచే చెప్పేవాడు. చిన్నతనం నుంచే దేశభక్తి జాస్తి.అందుచేత తల్లి అతనితో పెళ్ళి ప్రస్థావించినప్పటికీ ‘తాత నన్ను దేశానికి వదిలేసాడు’ అని వివాహం చేసుకోకుండా ఢిల్లీ వెళ్లిపోయి ఒక పత్రికలో చేరి స్వాతంత్య్రోచ్ఛతో రచనలు చేయసాగాడు. నాయనమ్మ నీ పెళ్లి చూడాలంటోంది, పెళ్ళి నిశ్చయించాం రమ్మంటే భగత్ సింగ్ ‘మీ ఉత్తరం చదివి నేను ఆందోళన చెందాను. మీ వంటి దేశభక్తుడు, వీరుడు ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకుంటే ఇక సామాన్యుడి మాటేవిటి? నా గురించి, నాయనమ్మ గురించి ఆలోచించకుండా కోట్లాది దేశ ప్రజల గురించి ఆలోచించరేం’ అంటూ ఎదురు ప్రశ్న వేసాడు. భగత్‌సింగ్ ఒక వ్యక్తి కాదు. మహా విప్లవ శక్తి అని చెప్పుకోవాలి.





