ArticlesNews

భార‌త ఆధ్యాత్మిక జీవ‌న వ్యాఖ్యాత… సంత్ నామ్‌దేవ్

266views

మ‌ధ్య‌యుగంలో మొఘలులు, ముస్లిం రాజుల‌ దండ‌యాత్ర‌లతో హిందుత్వం ముక్క‌లై పోతున్న స‌మ‌యంలో ఈ దేశంలో ఎంద‌రో ధ‌ర్మ గురువులు, భ‌క్త సాధువులు జ‌న్మించి ఏకాత్మ నిర్మాణానికి కృషి చేశారు. వేదాంత ద‌ర్శ‌నం ద్వారా దేశాన్ని భ‌క్తి మార్గంలో న‌డిపించారు. అటువంటి వారిలో ఆదిశంక‌రులు, చైత‌న్య మ‌హా ప్ర‌భువు, తుకారాం, స‌మ‌ర్థ రామ‌దాసు, జ్ఞానేశ్వ‌రుడు, సంత్ నామ్‌దేవ్ మొద‌లైన వారు ప్ర‌ఖ్యాతి చెందారు. భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవ‌నంలో ముఖ్యంగా భక్తి సంప్రదాయంలో నామ్‌దేవ్ అగ్ర‌గ‌ణ్యులు. దక్కన్ రాష్ట్రంలోని పండ‌రీపురంలో 1270 అక్టోబర్ 26న కార్తీక శుక్ల పక్ష ఏకాదశి తిథి నాడు నామ్‌దేవ్ జన్మించారు. తండ్రి దామాషేట్ షింపీ, వృత్తిరీత్యా టైలర్. త‌ల్లి గోనాబాయి. నామ్‌దేవ్‌కు 14వ ఏట‌నే రాజాబాయితో వివాహ‌మైంది. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. రాజాబాయి అత్యంత భక్తి పరురాలు. ఇద్దరూ తమ జీవితాన్ని విఠలుడి సేవలో గడిపారు. శ్రీ కృష్ణునికి మిత్రుడు, సలహాదారు అయిన ఉద్ధవుని పునర్జన్మ నామ్‌దేవ్ అని చాలా మంది భక్తులు బలంగా విశ్వసించేవారు.

ఉత్త‌ర భార‌తంలో భ‌క్తి మార్గాన్ని ప్ర‌చారం చేసిన మ‌హారాష్ట్ర సాధువుల‌లో నామ్‌దేవ్ స్థానం ప్ర‌త్యేక‌మైన‌ది. త‌న బాల్యం నుంచి జీవింతాంతం విఠ‌ల భక్తిని ప్ర‌భోదించారు. మోక్ష ప్రాప్తికి, భ‌గ‌వంతుడి కటాక్షం పొంద‌డానికి నామ‌మే ఏకైక సాధ‌న‌మ‌ని ఉప‌దేశించేవారు. ఆయ‌న ఒక ప్రాంతానికే ప‌రిమితం కాకుండా అఖిల భార‌త వ్య‌క్తిత్వాన్ని సంత‌రించుకున్నారు. హిందూ వేదాంతంలోని మౌలిక‌మైన సందేశాన్ని ప్ర‌చారం చేశారు. వేదాంత మూల సిద్ధాంతాల‌ను వ‌ర్త‌మాన యుగానికి అనుగుణంగా రూపొందించి, అందులోని మూఢ విశ్వ‌సాల‌ను ఎన్నింటినో తొల‌గించారు. ఎన్నో సాంఘిక భావాల‌ను, ఆచారాల‌ను విమ‌ర్శించారు. భ‌గ‌వంతుడి ప‌ట్ల భ‌క్తి విశ్వాసాల‌ను ప్ర‌చారం చేశారు. మ‌నుషులంతా స‌మాన‌మే అనే సిద్ధాంతాన్ని సాధికారంగా నిరూపించి, అమ‌లు చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. జాతి, వ‌ర్ణ భేదాల‌ను, మ‌త‌మౌఢ్యాన్ని తీవ్రంగా నిర‌సించారు. చిత్త‌శుద్ధి లేని తీర్థ‌యాత్ర‌లు, పూజాదికాలు, విగ్ర‌హారాధ‌న‌లు వ్య‌ర్థ‌మ‌ని నొక్కిచెప్పారు.

నామ్‌దేవ్ వందలాది అభంగాల (భక్తిగీతాలు) ర‌చ‌న‌కు శ్రీ‌కారం చుట్టారు. నేటికీ ఆయ‌న అభంగాలను మహారాష్ట్ర అంతటా భక్తి శ్రద్ధలతో ఆలపిస్తున్నారు. ఆధునిక భారతదేశ ప్రజా జీవితంలోని ప్రధాన చర్చల్లో, ముఖ్యంగా మరాఠీ, హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఆయ‌న ప్రభావం విస్తృతంగా కనిపిస్తుంది. నామ్‌దేవ్ 20 ఏళ్ళ వయసులో పండరీపూర్ లో సంత్ జ్ఞానేశ్వరుడిని కలిశారు. విఠోబాకు గొప్ప భక్తుడైన నామ్‌దేవ్ పట్ల జ్ఞానేశ్వరుడు ఆకర్షితులయ్యారు. వారిద్ద‌రూ దేశ వ్యాప్తంగా ప‌ర్య‌టించి తీర్థయాత్రల‌కు వెళ్ల‌డం నామ్‌దేవ్ జీవితంలో అత్యంత ముఖ్యమైన కాలం. అప్ప‌టినుంచి జ్ఞ‌నేశ్వ‌రుడు సమాధి చెందే వ‌ర‌కూ ఈ ఇద్దరూ దాదాపుగా విడిపోలేదు. దేశంలోని అన్ని ప్రాంతాలను సందర్శించిన నామ్‌దేవ్ పంజాబ్ చేరుకున్నారు. గురుద్వారా దర్బార్ సాహిబ్ ఉన్న ఘుమన్ గ్రామానికి చేరుకొని అక్క‌డే 17 సంవత్సరాలకు పైగా నివసించారు. అక్క‌డి ప్ర‌జ‌లు ఆయ‌న్ను గురువులా స్వీక‌రించి, ఆద‌రించారు. సిక్కుల మ‌త గ్రంథ‌మైన గురు గ్రంథ్ సాహిబ్ లో ఉన్న నామ‌దేవుడి 61 కీర్త‌న‌లు ఆయ‌న కృతిత్వానికి ప‌ర‌మ ప్ర‌మాణాలు. ఆయ‌న త‌ర్వాత భ‌క్తి మార్గ ప్ర‌చార‌కులుగా ప్ర‌సిద్ధికెక్కిన రామానంద్‌, గురునాన‌క్‌, రైదాసు, పీసా మొద‌లైన వారంతా త‌మ ర‌చ‌న‌ల్లో నామ్‌దేవ్‌ను స‌గౌర‌వంగా ఉటంకించారు.

నామ్‌దేవ్ కాలంలో మహారాష్ట్రలో నాథ్, మహానుభావ శాఖల ప్రభావం ఎక్కువగా ఉండేది. వీటితో పాటు పండరీపురానికి చెందిన ‘విఠోబా’ ఆరాధన కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆరాధనను దృఢంగా నిర్వహించడానికి వారీక‌ర‌ సంప్ర‌దాయానికి అంటే భాగ‌వ‌త ధ‌ర్మానికి నామ్‌దేవ్ పునాది వేయ‌డంతో పాటు దాని వ్యాప్తికి కృషి చేశారు. ఉత్తర భారతంలో ఆయ‌న్ను నిర్గుణ భక్తుడిగా, మరాఠీ సంస్కృతిలో సగుణ భక్తుడిగా భావించే ఆచారం నేటికీ కొనసాగుతోంది. చివ‌రి ద‌శ‌లో పంజాబ్ నుంచి పండ‌రీపురం చేరుకున్న సంత్ నామ్‌దేవ్ 1350లో విఠ‌లుడి నామాన్ని జ‌పిస్తూ ఆయ‌నలోనే ఐక్య‌మైపోయారు.