
వేదాలు సమస్త ధర్మాలకు మూలమని, వేదస్వస్తి చేయడం వల్ల లోకమంతా సుభిక్షంగా ఉంటుం దని గోష్పాదక్షేత్ర వేదశాస్త్రాబివర్దక పరిషత్ అధ్యక్షుడు డీఆర్‌ఎస్‌ఎన్ శాస్త్రి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాదక్షేత్ర వేదశాస్త్రాబివర్దక పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వూరు గోష్పాదక్షేత్రంలోని నిరంజన ధర్మజ్ఞాన కళావేదికలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సహకారంతో వేదసభ జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రుత్వికులు వేద పఠనం చేశారు. వేద మంత్రోచ్చరణ చేస్తూ వేదస్వస్తి పలికారు. వేదశాస్త్ర పండితులు మాట్లాడుతూ కొవ్వూరు ఆధ్యాత్మిక కేంద్రమని, వేదసభలు అంతటా నిర్వహించాలన్నారు. గోష్పాదక్షేత్రంలో నిరంతరం ధర్మకార్యాలు జరుగుతుంటాయన్నారు. కార్యక్రమంలో నోరి బోగేశ్వరశర్మ, విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి, దువ్వూరి ఫణి సోమయాజులు, గుళ్ళపల్లి శర్మ, దోర్భల ప్రభాకరశర్మ, కలిగొట్ల కృష్ణారావు, చామర్తి రమా సత్యనారాయణ శాస్త్రి, పి.మురళీకృష్ణ తదితరులతో పాటు 150 మంది రుత్వికులు, ఘనాపాటీలు, క్రమపాటీలు, వేదశాస్త్ర పండితులు పాల్గొన్నారు.



