
కోట్లాది మంది భక్తులు, ప్రజలు పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు మొదలైయ్యాయి. రాష్ట్రంలో నిర్వహించే ఈ పుష్కారాలకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం స్థానిక నేతలు, యంత్రాంగం అప్రమత్తం అయ్యారు. ముందస్తు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. గోదావరి పుష్కరాలకు చేపట్టాల్సిన పనులపైన నిర్ణయానికి వచ్చారు.
ఈసారి గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తాజాగా 2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయించారు. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఈసారి పుష్కరాల కోసం దాదాపు 8 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదలు అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. సుమారు రెండున్నరేళ్ల కంటే ఎక్కువ సమయం ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇప్పటి నుంచే రంగంలోకి దిగారు.
అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు. అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొవచ్చని ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లు ఉండగా మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు. యాత్రికుల బస ఏర్పాట్లపై అధికారులు చర్చించారు.
రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. కార్పొరేషన్ రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. సిటీ బ్యూటిఫికేషన్, ఐకానిక్ టూరిజం సైట్ ప్రాజెక్టు కోసం రూ.75 కోట్లతో ప్రాతిపాదించారు.
ఈసారి గోదావరి పుష్కరాలకు జిల్లాను యూనిట్‌గా తీసుకుని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన నిధులను సమీకరించుకుని, సమగ్ర అభివృద్ధి యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నాట్లు తెలిపారు.




