News

ఇంట్లో గణపతి పూజకు మోదీ హాజరుపై సీజేఐ ఏమన్నారంటే…

213views

వినాయక చవితి నవరాత్రుల సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్ ఇంట్లో పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవడంపై ప్రతిపక్షాలు రాజకీయ రగడ సృష్టించాయి. ఆ అంశంపై చంద్రచూడ్ ఇప్పుడు స్పందించారు. ఆ సమావేశంలో జ్యుడీషియల్ విషయాలేవీ చర్చించలేదని చెప్పారు. లోక్‌సత్తా యాన్యువల్ లెక్చర్‌లో పాల్గొన్నప్పుడు ఎదురైన ప్రశ్నకు చంద్రచూడ్ జవాబిచ్చారు. హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ముఖ్యమంత్రులు క్రమం తప్పకుండా కలుసుకుంటూ ఉంటారని గుర్తుచేసారు.

‘‘ఈ సమావేశాలు దేనికని ప్రజలు అనుకోవచ్చు. మన రాజకీయ వ్యవస్థ చాలా పరిపక్వమైనది. రాజకీయవర్గాలు జ్యుడీషియరీ విషయంలో వినయంగా ఉంటారు. అది అందరికీ తెలిసిందే. జ్యుడీషియరీకి బడ్జెట్ ప్రభుత్వం నుంచే రావాలి. అది జడ్జిల కోసం కాదు. మాకు కొత్త కోర్టు భవనాలు కావాలి. జిల్లాల్లో జడ్జిలకి కొత్త ఇళ్ళు కావాలి. దానికోసం ప్రధాన న్యాయమూర్తులు ముఖ్యమంత్రులతో సమావేశం అవడం తప్పనిసరి’’ అని వివరించారు.

తను గతంలో అలహాబాద్ హైకోర్టులో సీజేగా పనిచేసానని చంద్రచూడ్ చెప్పారు. ‘‘ప్రధాన న్యాయమూర్తిని నియమించాక, ఆ వ్యక్తి ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలుస్తాడు. తర్వాత ముఖ్యమంత్రి సీజేని ఆయన నివాసంలో కలుస్తాడు. ఆ సమావేశాలు అజెండాను నిర్దేశిస్తాయి. ఉదాహరణకి రాష్ట్రంలో పది ప్రాజెక్టులు నడుస్తున్నాయనుకోండి, వాటి గురించి వివరిస్తారు. తమ ప్రాధామ్యాలేమిటో సీఎం చెబుతారు’’ అని చంద్రచూడ్ వివరించారు.

‘‘రాజకీయ నాయకులు చాలా పరిపక్వతతో ఉంటారు. ఇలాంటి సమావేశాల్లో ఏ సీఎం ఐనా ఎప్పుడూ ఎలాంటి పెండింగ్ కేసుల గురించీ అడగరు. ఆగస్టు 14, జనవరి 26, ఏదైనా పెళ్ళి లేదా చావు అలాంటి సందర్భాల్లో సీఎం, సీజే కలుస్తారు. అప్పుడు న్యాయవ్యవస్థ గురించి చర్చ ఉండదు. జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు. నిజానికి మామూలు పిచ్చాపాటీ కబుర్లే ఉంటాయి’’ అని స్పష్టం చేసారు.