News

ప్రాణాలిస్తామంటూ వక్ఫ్ బిల్లుపై రెచ్చగొడుతున్న పర్సనల్ లాబోర్డు

342views

వక్ఫ్ బోర్డు ఆగడాలకు, అక్రమాలకు అడ్డుకట్ట వేసే వక్ఫ్ బిల్లు 2024 విషయంలో కొందరు ముస్లింలను రెచ్చగొడుతూనే వున్నారు. రోజురోజుకీ ఇది మరీ పెరిగిపోతోంది. రోజురోజుకీ కొందరు అగ్నిలో ఆజ్యం పోస్తున్నట్లు ప్రకటనలు చేస్తూనే వున్నారు. దీంతో అమాయకమైన వారు బలవుతున్నారు. తాజాగా ఈ బిల్లుపై ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు అధ్యక్షుడు మౌలానా ఖాలీద్ సైఫుల్లా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లును అడ్డుకుంటామని బెదిరింపులకు దిగారు. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనుకాడమంటూ ప్రకటనలు చేశారు.కాన్పూర్ లో ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా వక్ఫ్ బిల్లుపై విషం చిమ్మారు. ముస్లింలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు. వక్ఫ్ బోర్డు తమకు జీవన్మరణ సమస్య అని, ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామన్నారు. అత్యవసరమైతే ప్రాణాలు కూడా ఇవ్వడానికి వెనుకాడమని ప్రకటించారు.

జైళ్లనిండా ముస్లింలను నింపుతాం కానీ… బిల్లును అమలు కానివ్వమని పేర్కొన్నారు. వక్ఫ్ బిల్లును తీసుకురావడం ద్వారా ముస్లింల భూములను లాక్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు నిర్వాహణ ముస్లిమేతర చేతుల్లోకి వెళితే మసీదులపై, శ్మశానాలపై (ఖబ్రస్థాన్) పై సానుభూతి చూపిస్తారా?అంటూ ప్రశ్నించారు. ఈ బిల్లు అత్యంత ప్రమాదకరమైందని, భూములను లాక్కుంటారంటూ విష ప్రచారాన్ని ప్రారంభించారు. తమిళనాడులో 4,78,00 ఎకరాల ఆలయ భూమి వుందని, ఏపీలో 4,68,000 ఎకరాల ఆలయ భూమి వుందని, ఈ రెండు రాష్ట్రాల్లోనూ 10 లక్షల ఎకరాల దేవాలయ భూమి వుందని పేర్కొన్నారు.

అదే ముస్లింలకు ఆరు లక్షల ఎకరాల వక్ఫ్ భూమి వుంటే వచ్చిన సమస్య ఏంటని ఎదురు ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డులోని కొందరిపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందంటూ నిరాధార ఆరోపణలకు దిగారు. వక్ఫ్ బోర్డుకి, ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తితే కలెక్టర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారా? కలెక్టర్ ప్రభుత్వం వైపే వుంటారని, ముస్లింలు ఆలోచించాలని మౌలానా ఖాలీద్ సైఫుల్లా అన్నారు.