
జగద్గురు ఆదిశంకరాచార్య నలుగురు ప్రధాన శిష్యుల్లో పద్మపాదుడు ఒకరు. అతని అసలు పేరు సనందన. ఒక సారి శంకరాచార్యులు, సనందుని గురుభక్తిని లోకానికి నిరూపించాలనుకున్నారు. గంగానదికి ఒక వైపు సనందన గురువుగారి బట్టలు ఉతికి ఆరేస్తున్నాడు. నదికి ఆవలివైపున స్నానం చేసి తడి బట్టలతో బయటకు వచ్చిన ఆదిశంకరులు – పొడి బట్టలు తెమ్మని సనందుని పిలిచారు. గురువుపట్ల అమిత భక్తి ఉన్న సనందన- గురువర్యులు తడి వస్త్రాల్లో ఉండటం చూడలేకపోయాడు. వెంటనే పొడిదుస్తులు ఇవ్వాలనుకున్నాడు. ఉధృత ప్రవాహాన్ని చూసి భయపడ లేదు. కనీసం నదిని దాటడానికి పడవలో వెళ్లాలని కూడా అతడికి తోచలేదు. నేలమీద నడిచినట్లు, గంగానదిలో నడుచుకుంటూ ముందుకు సాగాడు సనందన. మునిగి పోతానన్న భయం కానీ, చేతిలోని పొడి బట్టలు ఆ నీళ్లలో పడి తడుస్తాయన్న సందేహం కానీ లేవు.
అంతటి అచంచల భక్తి చూపుతున్న భక్తుణ్ణి ఆదిశంకరులు ఆదుకోకుండా ఉండరు కదా! సనందుడి అడుగు పడే ప్రతి చోటా తామర పువ్వులను పరిచి దోవ చేసింది గంగాదేవి. సనందుడు శరవేగంగా అడుగులు వేస్తున్నాడే కానీ.. తాను కుసుమాల మీద నడుస్తున్నట్టు గ్రహించలేదు. చుట్టూ ఉన్న వాళ్లు ఆశ్చర్యంగా చూస్తుండగానే సనందుడు నదిని దాటేసి గురువుకు వస్త్రాలు అందించాడు. శంకరాచార్యులు నవ్వుతూ ‘సనందనా! ఇంత త్వరగా నదిని ఎలా దాటగలిగావు?’ అనడిగారు. ‘గురువర్యా! మిమ్మల్ని తలచుకుంటే ఎలాంటి కష్టమైనా మాయమై పోతుంది. మీ అనుగ్రహంతో దేన్నయినా దాటేయొచ్చు’ అన్నాడు. అప్పటికి కూడా అతడికి నది మీద నడుస్తూ వచ్చానన్న స్పృహ లేదు. శంకరులు ‘వెనుతిరిగి చూడు.. నువ్వు అడుగు వేసిన ప్రతీచోట ఓ పద్మం వెలసింది. వాటి మీదే అడుగులేస్తూ వచ్చావు. ఈరోజు నుంచీ నువ్వు పద్మపాదుడిగా ప్రసిద్ధి చెందుతావు’ అని ఆశీర్వదించారు. ఎవరికైతే గురువు పట్ల అచంచలమైన భక్తి, ప్రేమ, నమ్రత, నమ్మకం ఉంటాయో, వారిని గురువు కంటికి రెప్పలా కాపాడుతారు, వారికి ఏ లోటూ రాకుండా చూసుకుంటారని ఈ ఉదంతం రుజువు చేస్తుంది.





