
కాకినాడ జిల్లా కేంద్రం శివారు సర్పవరంలో ఉన్న భావనారాయణ స్వామి ఆలయంలో రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
ఉత్సవాల మొదటి రోజు అయిన 25న సుప్రభాత సేవ, మూలవిరాట్‌కు స్నపనం, అమ్మవారు-స్వామివార్లను వధూవరులుగా అలంకరణ, నిత్యపూజలు, హోమాలు నిర్వహిస్తారు. సాయంత్రం ఉత్సవమూర్తులను పెద్ద శేషవాహనంపై తిరువీధుల్లో ఊరేగిస్తారు.
26వ తేదీన నిత్యపూజలు, బాలభోగం నివేదన, హోమాలు జరగగా, సాయంత్రం చిన్న శేషవాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. 27న తులసి పూజలు, నిత్యహోమాలు, సాయంత్రం గరుడవాహనంపై ఉత్సవం, వార్షిక దివ్యకల్యాణం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులకు కల్యాణ తలంబ్రాలు పంపిణీ చేస్తారు.
28న అశ్వవాహనంపై స్వామివారిని పెండ్లికుమారుడిగా, అమ్మవారిని పెండ్లికుమార్తెగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహిస్తారు. 29న సింహవాహన సేవ, పండిత సదస్సు, ఫలప్రదానం జరుగుతుంది. 30న పెద్ద పుష్పకవాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
మే 1న సర్పవాహనంపై భారీ ఊరేగింపుతో సూర్యారావుపేట సముద్రతీరానికి తీసుకెళ్లి చక్రపెరుమాళ్లకు చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం తిరిగి తిరువీధి ఉత్సవం ఉంటుంది.
మే 2న సుప్రభాత సేవ, స్నపనం, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, సాయంత్రం బేడా ఉత్సవం, లక్ష్మీ సంవాదం, శ్రీపుష్పయాగోత్సవం, పవళింపు సేవలు జరుపుతారు. ఈ సందర్భంగా 1008 మంది దంపతులకు తాంబూలాలు అందజేస్తారు.
మే 3న తొలిసారిగా ఆలయం ఎదురుగా ఉన్న ముక్తికా సరస్సులో ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగునీరు, అతిథిగృహం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దేవాదాయ, పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి రాపాక శ్రీనివాస రావు మాట్లాడుతూ, ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.





