News

2,500 మంది అమ్మాయిలకు కన్యాదానం చేసిన దంపతులు

25views

కైలాస్‌బాపు కోటే, సుమిత్ర కోటే..! ఈ ఇద్దరూ మహారాష్ట్రలోని షిర్డీకి చెందిన దంపతులు. వీళ్లు పుత్రికా సంతానం కోసం ఎంతో ఆశపడ్డారు. కానీ వారికి ఆ భాగ్యం కలుగలేదు. దాంతో వారు ఆడబిడ్డపై ఉన్న మమకారాన్ని మరో విధంగా చాటుకుంటున్నారు. ఏళ్లుగా వేలమంది యువతులకు తల్లిదండ్రులుగా మారి కన్యాదానం చేస్తున్నారు. ఒకటికాదు, రెండుకాదు గత 25 ఏళ్లలో ఏకంగా 2,500 మంది అమ్మాయిలకు కన్యాదానం చేశారు.

వీళ్లు పెళ్లిళ్లను ఏదో తూతూమంత్రంగా జరుపరు. వివాహంలోని ప్రతి ఘట్టాన్ని సంప్రదాయం ప్రకారం అంగరంగవైభవంగా జరిపిస్తారు. ఈ విధంగా ఈ దంపతులు సామాన్య కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గిస్తూ అండగా నిలుస్తున్నారు. భవిష్యత్తులో ఈ జంటలకు ఆడపిల్ల పుడితే వారి పేరిట డిపాజిట్‌ చేయడానికి వీలుగా బ్యాంకులో రూ.10 వేలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ కూడా‌ చేస్తారు. షిర్డీలోని సాయి సిద్ధి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వీరు పెళ్లిళ్లు జరిపిస్తారు.

తాజాగా సోమవారం జరిగిన వేడుకలో 51 మంది యువతులకు పెళ్లిళ్లు చేశారు. ఈ వేడుకకు సుమారు 50 వేలమంది అతిథులుగా హాజరయ్యారు. కైలాస్‌ బాపు దంపతులు వధువులందరికీ ఒక గ్రాము మంగళసూత్రం, చీర, వెండి కాలి మెట్టెలు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువులను బహూకరించారు. అదేవిధంగా ఆడశిశువుల హత్యలకు పాల్పడబోమని, లింగ వివక్ష పాటించబోమని వారు కొత్త జంటలతో ప్రతిజ్ఞ చేయించుకుంటున్నారు.