
సేంద్రియ వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించి బయోగ్యాస్, సేంద్రియ ఎరువులుగా మార్చడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే గోబర్ధన్ ప్లాంటు ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ దిశగా ద్వారకాతిరుమలలో కీలక అడుగు పడింది.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రూ.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన గోబర్ధన్ ప్లాంటును స్వచాంద్ర చైర్మన్ కే. పట్టాభిరాం, ఎం. వెంకటరాజు సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ప్లాస్టిక్ రహిత వాతావరణం కల్పించడం, వ్యర్థాలను సంపదగా మార్చే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ద్వారకాతిరుమలలో ఏర్పాటు చేసిన ఈ గోబర్ధన్ ప్లాంటు ద్వారా ఆలయంలో ఉత్పత్తి అయ్యే సేంద్రియ వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేసి బయోగ్యాస్, ఆర్గానిక్ ఎరువులుగా మలుస్తామని చెప్పారు.కాలుష్యాన్ని తగ్గించడం, ‘వేస్ట్ టు వెల్త్’ లక్ష్యాన్ని సాధించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా ఇటువంటి గ్రీన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్లాంటు ద్వారా శుభ్రమైన శక్తి ఉత్పత్తి సాధ్యమవడంతో పాటు, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన వివరించారు.
ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ, గోబర్ధన్ ప్లాంటు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. సేంద్రియ వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా శుభ్రత మెరుగుపడటంతో పాటు పునర్వినియోగ శక్తి ఉత్పత్తికి ఇది దోహదపడుతుందని అన్నారు.
ఈ ప్రాజెక్ట్ గ్రామీణాభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.





