( అక్టోబరు 23 – బాలయోగి జయంతి )
భారతదేశం దేవుని జ్ఞానానికి నిలయం. అనేకమంది ఆధ్యాత్మిక పురుషులు తమ దైవిక సందేశాల ద్వారా ఈ దేశాన్ని జ్ఞానంతో నింపారు. యోగీశ్వరులు ఒక లక్ష్యం, కర్తవ్యం కోసం ఈ భూమి పై అవతరిస్తారు. కర్తవ్యం పూర్తయ్యాక శరీరాన్ని విడుస్తారు. అయితే తమ భావాలను అందరిలో నింపి వెళ్ళడం వల్ల అవి ఎప్పటికి సజీవంగానే ఉంటాయి. ఆ సజీవ భావమే బాలయోగీశ్వరుల స్వరూపమై వెలుగొందుతోంది. సుమారు నాలుగు దశబ్దాల పాటు నిరాహారంగా తపస్సులో మునిగి భక్తులపై కరుణాకటాక్షాలను ప్రసరింపజేసిన శ్రీ భగవాన్ బాలయోగీశ్వరుల చరిత్ర భారతీయ ఆధ్యాత్మిక పరంపరలో ఓ అరుదైన ఘట్టం.
సుందరమైన ప్రకృతితో పాటు కవులను, పండితులను, దాతలను అందించిన నేలగా తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమకు విశేష ప్రాముఖ్యం ఉంది. ఈ విశిష్ట ప్రదేశంలోని అమలాపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముమ్మిడివరం ఆధ్యాత్మికంగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందిందంటే అందుకు శ్రీభగవాన్ బాలయోగీశ్వరులే కారణం. ఆయన తపో ఆశ్రమం ఇక్కడే ఉంది. బాలయోగీశ్వరులు ముమ్మిడివరం గ్రామంలోని హరిజనవాడలో శ్రీమతి రామమ్మ, గంగయ్య దంపతులకు ప్రమోదూత నామ సంవత్సరం కార్తీక శుద్ధ తదియ గురువారం స్వాతి నక్షత్రం నందు అంటే 1930 అక్టోబరు 23న మూడవ సంతానంగా జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు సుబ్బారావు. ఆయనకు 10 సంవత్సరాల వయస్సు రాగానే బాపన్న అనే రైతు వద్ద గోవుల కాపరిగా చేర్చారు. అయితే పూర్వజన్మ వాసనల ఫలితమో ఏమో సుబ్బారావు ధ్యాస అంతా ధ్యానంపైనే ఉండేది. తన 16వ ఏటన కృష్ణుడు, నారదుల ఫోటోను ఎదురుగా ఉంచుకొని యోగముద్రలో ధ్యానం చేసుకుంటూ గడిపారు. ఆ సుబ్బారావే కాలక్రమంలో బాలయోగీశ్వరులుగా ప్రసిద్ధి పొందారు.
ముక్తిని పొందడానికి, జ్ఞానాన్ని పొందడానికి సాధన అవసరమన భావించిన బాలయోగీశ్వరులు సుమారు నాలుగు దశాబ్దాల పాటు మౌనముద్రలోనే గడిపారు. మౌనాన్నే సంకేతంగా చేస్తూ భక్తుల్లో జ్ఞానతృష్ణను మేల్కొలిపారు. తపస్సు చేసుకునేందుకు హిమాలయాలకో, అడవులకో వెళ్లనవసరం లేదని ప్రజా సమూహం మధ్యలో ఉండి కూడా తపస్సు చేయవచ్చని బాలయోగీశ్వరులు సందేశాన్ని ఇచ్చారు. నలభై ఏళ్లు మౌనముద్రలో ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే భక్తుల విన్నపం మేరకు మౌనం వీడి వారి కష్టాలను తీర్చేవారు. భక్తుల కోరిక మేరకు మహాశివరాత్రి పర్వదినం మరునాడు బాలయోగీశ్వరులు దర్శనం ఇచ్చేవారు. చంచల మనస్సును కట్టడి చేయగలిగితే వారి ఆత్మే గురువని బాలయోగీశ్వరులు తరచుగా బోధించేవారు.
శ్రీ బాలయోగీశ్వరుల ప్రబోధం సర్వ మానవులు ఒకటే అనే భావనను ధ్వనింపజేస్తుంది. భగవత్ తత్వాన్ని అన్వేషిస్తూ యోగవిద్యను వశపర్చుకొని అష్టాంగ యోగం ద్వారా అనితర తపస్సుతో ధ్యాన సమాధిలోకి వెళ్ళిన బాలయోగీశ్వరులు 28 మార్చి 1985లో శివైక్యం పొందారు. ఆయన చూపిన ఆధ్యాత్మిక ప్రభావం కారణంగానే గోదావరి జిల్లాల్లో ఎక్కువగా తమ బిడ్డలకు బాలయోగి పేరు పెడుతుంటారు. శ్రీ భగవాన్ బాలయోగీశ్వరులు బోధనలు అనుసరించి ఆధ్యాత్మిక సాధన ద్వారా మానవ జన్మను సార్థకం చేసుకుందాం.





