News

భక్తిశ్రద్ధలతో సిరిమాను తరలింపు

309views

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అనంతరం చదురుగుడి ఆలయం వద్ద భక్తుల దర్శనార్థం ఉంచిన సిరిమానును కొత్తపేట తరలించారు. ఉదయం 6.30 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం దీక్షాధారులు తల్లి శరణఘోష నడుమ ఈ కార్యక్రమాన్ని సంప్రదాయంగా చేపట్టారు. శివాలయం వీధి, పార్కుగేటు, మండపం, సుద్దవీధి మీదుగా తీసుకెళ్లి.. కొత్తపేట మండపం సమీపంలోని రాజ్‌గోపాల్‌ పెండ్రిస్‌లో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా దారిపొడవునా భక్తులు సిరిమానును ఆరాధించారు. తల్లి సేవకులు, దీక్షాధారులు, హుకుంపేట వాస్తవ్యులు పాల్గొన్నారు.

చెరువులోకి దిగిన తెప్ప..
అమ్మవారి పండగ అనంతరం వచ్చే మంగళవారం పెద్ద చెరువులో తెప్పోత్సవం జరగనుంది. ఇందులో భాగంగా గాఢీఖానా సమీపంలోని ఒడ్డున అమ్మవారు విహరించే తెప్పను వడ్రంగులు నాలుగు రోజులుగా తయారు చేస్తున్నారు. శుక్రవారానికి పనులు పూర్తికాగా.. శనివారం జేసీబీ సాయంతో చెరువులోకి దించారు. సోమవారం ప్రాథమిక పరిశీలన అనంతరం, మంగళవారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని దేవస్థానం సహాయ కమిషనర్‌ డీవీవీ.ప్రసాదరావు తెలిపారు.