
పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే… ఓ షరతు మీద బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. ప్రతి నెలకి రెండుసార్లు జాతీయ జెండాకి సెల్యూట్ చేయాలని, 21 సార్లు భారత్ మాతాకీ జై అని నినదించాలని కోర్టు ఆదేశాలిచ్చింది.అలాగే సొంత పూచీకత్తు 50 వేల రూపాయలు చెల్లించి, పై షరతులను కచ్చితంగా పాటించాలని ఫైజల్ ఖాన్ ని హైకోర్టుఆదేశించింది.
భోపాల్ లో దేశ వ్యతిరేక నినాదాలు చేసినందుకు పోలీసులు మే నెలలో ఫైజల్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. విచారణ ముగిసే వరకూ ప్రతి నెల ఒకటి మరియు నాలుగో మంగళవారం భోపాల్ లోని మిస్రోడ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి జాతీయ జెండాకి వందనం చేయాలని జస్టిస్ దినేష్ కుమార్ పలీవాల్ తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అలాగే 21 సార్లు భారత్ మాతాకీ జై అని నినాదం కూడా చేయాలని కోర్టు ఆదేశించింది. వీటన్నింటితో పాటు నెలలో రెండు రోజులు కచ్చితంగా పీఎస్ లో హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది.
మరోవైపు తనను ఈ కేసులో ఇరికించారని ఫైజల్ ఖాన్ హైకోర్టుకెక్కాడు. అయితే… విచారణ సమయంలో ఫైజల్ ఖాన్ దేశ వ్యతిరేక నినాదాలు చేశాడని సాక్షాత్తూ ఆయన తరపున న్యాయవాదే అంగీకరించడం విశేషం. నేరాన్ని అంగీకరించడంతో షరతులు విధించి, బెయిల్ పై విడుదల చేయాలని న్యాయవాది కోర్టుని కోరారు. అయితే.. బెయిల్ ఇవ్వొద్దని, ఉద్దేశపూర్వకంగా ఇలాంటి నినాదాలు చేశాడని, అతనిపై 14 క్రిమినల్ కేసులు కూడా వున్నాయని ప్రాసిక్యూషన్ లాయర్ వాదించాడు.





