News

మదర్సా బోర్డులను మూసేయండి.. నిధులు ఆపేయండి : NCPCR సిఫార్సులు

535views

జాతీయ బాలల హక్కుల కమిషన్ (NCPCR) మదర్సా బోర్డుల విషయంలో కీలక సిఫార్సులు చేసింది. అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వున్న మదర్సా బోర్డులను మూసేయాలని సిఫార్సు చేసింది. అలాగే వాటికి నిధులను కూడా ఆపేయాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. విద్యాహక్కు చట్టం 2009 అనుగుణంగా మదర్సాల్లో వున్న ముస్లిమేతర పిల్లలను వెంటనే సాధారణ పాఠశాలలకు తరలించాలని NCPCR సూచించింది. అయితే.. ముస్లిం సమాజానికి చెందిన పిల్లల విద్యా స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఈ సిఫార్సులు చేశామని కూడా వెల్లడించింది. దేశంలోని పిల్లలందరూ సురక్షితమైన, మంచి వాతావరణంలో పెరగాలని, అంతిమంగా వారందరూ కచ్చితంగా దేశాభివృద్ధికి తోడ్పడేలా ఓ రూట్ మ్యాప్ ను రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

మరోవైపు కమిషన్ చైర్మన్ ప్రియాంక్ కనుంగో మాట్లాడుతూ.. మదర్సాలు, అందులోని పిల్లలపై తొమ్మిది సంవత్సరాల పాటు సునిశితంగా అధ్యయనం చేసినట్లు వెల్లడించారు.ముస్లిం పిల్లలు పాఠశాల విద్యకు ఎలా దూరమవుతున్నారో, వారి హక్కులను ఎలా ఉల్లంఘిస్తున్నారన్న దానిపై కూడా అధ్యయనం చేసినట్లు తెలిపారు. వీటన్నింటి అధ్యయనం తర్వాత అన్ని రాష్ట్రాల సీఎస్ లకి లేఖలు రాశామని, మదర్సాలను మూసేయాలని కూడా అందులో సిఫార్సు చేసినట్లు ప్రకటించారు. ఎందుకైతే మదర్సాలు ప్రారంభమయ్యాయో ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని కమిషన్ పేర్కొంది. ప్రస్తుతం మదర్సా బోర్డులతో ఏమాత్రం సంబంధం లేని మదర్సాల్లో 1.2 కోట్ల మంది పిల్లలున్నారని కమిషన్ తెలిపింది.